Home జాతీయ national telgu ఆర్టెమిస్ II: చంద్రుడి మీదకు మరోసారి మానవ మిషన్.. ఎవరెవరు వెళ్తున్నారు? ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ లోపల...

ఆర్టెమిస్ II: చంద్రుడి మీదకు మరోసారి మానవ మిషన్.. ఎవరెవరు వెళ్తున్నారు? ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ లోపల ఎలా ఉంటుంది?

16
0

SOURCE :- BBC NEWS

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఫొటో సోర్స్, NASA

దాదాపు 50 ఏళ్ల తర్వాత మనిషి మరోసారి చంద్రుడి మీదకు వెళ్లబోతున్నాడు. ఈసారి భూమ్మీద నివసించిన ఎవరూ కూడా చంద్రుడి మీద ప్రయాణించలేని ప్రాంతాలకు ఈ కొత్త మిషన్ తీసుకెళ్లనుంది.

నలుగురు వ్యోమగాములు సుమారు 8 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ యాత్ర ఒక అద్భుతమే కాదు, ప్రమాదకరమైనది కూడా.

వాతావరణం సహా అన్నీ అనుకూలంగా ఉంటే, ఏప్రిల్ 1న నింగిలోకి వెళ్లనున్న ఈ మిషన్ చంద్రుడి అద్భుత దృశ్యాలను చూపించడమే కాకుండా, చంద్రుని చుట్టూ ఉన్న వాతావరణంపై కొత్త సమాచారాన్ని అందించనుంది.

ఇది భవిష్యత్తులో చంద్రుడిపై దిగడం, అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి మార్గం సుగమం చేసే మిషన్..

మరో గ్రహంపై ఎలా జీవించాలో మనిషి నేర్చుకునే తొలి అడుగు.

ఈ యాత్రలో వ్యోమగాములు ఇప్పటివరకు మనుషులు ఉపయోగించని కొత్త అంతరిక్ష నౌకలో ప్రయాణించనున్నారు.

వ్యక్తిగతంగా కూడా వ్యోమగాములకు ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. మినీబస్‌ పరిమాణంలో ఉన్న నౌకలో 10 రోజులపాటు ఆ నలుగురు వ్యోమగాములు గడపాల్సి ఉంటుంది.

ఈ ప్రమాదకరమైన మిషన్ అసలు ఎలా సాగుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

చంద్రుడి వైపు పయనం

నాసా వ్యోమగాములు స్పేస్ లాంచ్ సిస్టమ్ ( ఎస్ఎల్ఎస్) అనే మెగా లూనార్ రాకెట్‌ ద్వారా ఈ యాత్రను మొదలుపెడతారు. ఇది ఇప్పటి వరకు నాసా రూపొందించిన అత్యంత శక్తివంతమైన రాకెట్. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఇది ప్రయాణం ప్రారంభిస్తుంది.

322 అడుగుల (98 మీటర్ల) ఎత్తున్న ఈ రాకెట్ 2022లో ఆర్టెమిస్ I మిషన్‌లో భాగంగా ఒక్కసారి మాత్రమే నింగిలోకి ఎగిరింది. అది కూడా వ్యోమగాములు లేకుండా.

దీనికి రెండు భారీ బూస్టర్లు, నాలుగు ఇంజిన్లు ఉన్నాయి. రాకెట్‌ ఎగరడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేవి ఇవే.

నారింజ రంగులో కనిపించే ప్రధాన భాగం ఒక విశాలమైన ఇంధన ట్యాంక్. ఇందులో 30 లక్షల లీటర్లకు పైగా ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్ నిల్వ ఉంటుంది. ఈ ఎస్ఎల్ఎస్ ప్రధాన బాధ్యత ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను, అంటే వ్యోమగాములు కూర్చొనే నౌకను అంతరిక్షంలోకి మోసుకెళ్లడం.

ఒకవేళ యాత్ర ప్రారంభంలోనే ఏదైనా సమస్య వస్తే, రాకెట్ పైభాగంలో ఉన్న లాంచ్ అబార్ట్ సిస్టమ్ సురక్షితంగా వ్యోమగాములను బయటకు తీసుకు వస్తుంది.

ఈ ప్రయోగంలో ఆరంభమే అత్యంత కీలకమైంది, ప్రమాదకరమైనది. ఇక్కడ ప్రతిదీ సరిగ్గా పని చేయాలి. లేదంటే పెను ప్రమాదం జరగొచ్చు. అందుకే వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులతో కూర్చుని ఈ యాత్రలో ఉండే సాధకబాధకాలను ముందుగానే చర్చించారు.

” మా కుటుంబ సభ్యులు ప్రయోగాన్ని చూస్తున్నప్పుడు, వారితోపాటు ఒక వ్యోమగామి ఉంటాడు. ఇది ఒక విధంగా అద్భుతమైన క్షణం, అలాగే భయంకరమైన క్షణం కూడా కావొచ్చు” అని మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్న విక్టర్ గ్లోవర్ అన్నారు.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఫొటో సోర్స్, NASA

ఇందులో ప్రయాణించే ఆస్ట్రోనాట్లు ఎవరంటే?

ఆర్టెమిస్-II లో పాల్గొనబోయే నలుగురు వ్యోమగాముల్లో విక్టర్ గ్లోవర్ ఒకరు. ఆయన ఈ మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.

రీడ్ వైజ్‌మన్ కమాండర్‌గా, క్రిస్టీనా కోచ్ మిషన్ స్పెషలిస్టుగా, జెరెమీ హాన్సెన్ స్పెషలిస్టుగా సేవలు అందించబోతున్నారు.

ఈ బృందంలోని వారిలో ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నారు. వీరు రెండేళ్లకు పైగా ఈ యాత్రకు అవసరమైన కఠిన శిక్షణ పొందారు.

ఆర్టెమిస్-II మిషన్‌లో ఈ వ్యోమగాములు 10 రోజులపాటు ఓరియాన్ క్రూ క్యాప్సూల్‌లో గడుపుతారు. ఈ క్యాప్సూల్ పరిమాణం సుమారు 5 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు (15 అడుగులు x 9 అడుగులు) మాత్రమే. చాలా కొద్దిస్థలంలోనే నలుగురు కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది.

“నా బాడీ సైజ్ గురించే నేను కంగారు పడుతున్నాను. ఈ మిషన్‌లోకి నన్ను ఎంపిక చేయడంవల్ల కెనడాకు దక్కాల్సిన దానికంటే ఎక్కువ స్థలమే దక్కింది” అంటూ మిషన్ స్పెషలిస్ట్‌గా పనిచేయనున్న కెనడా జాతీయుడు జెరెమీ హాన్సెన్ సరదాగా వ్యాఖ్యానించారు.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

స్పేస్ క్రాఫ్ట్‌ లోపల ఎలా ఉంటుంది?

ఓరియాన్ క్రూ మాడ్యూల్‌కు 50 ఏళ్ల కిందటి అపోలో మిషన్‌లలో ఉపయోగించిన మాడ్యూల్‌లతో పోలిక ఉన్నా, లోపలి నిర్మాణం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఉన్న కొద్దిస్థలంలోనే నలుగురు వ్యోమగాములు పని చేయాలి, ఎక్సర్‌సైజ్, భోజనం, నిద్రలాంటివన్నీ చేయాలి. లాంచింగ్ సమయంలో లోపల నాలుగు సీట్లు ఉంటాయి. కానీ కక్ష్యలోకి చేరిన తర్వాత వాటిని మడిచి మరింత స్థలాన్ని కల్పించుకోవాల్సి ఉంటుంది.

భారరహిత వాతావరణంలో స్పేస్‌క్రాఫ్ట్‌ మొత్తాన్ని వాడుకునే వీలుంటుంది కాబట్టి, కంట్రోల్ ప్యానెల్ సీలింగ్‌ మీద అమర్చి ఉండొచ్చు. తాగడానికి, ఆహారంలో వాడుకోవడానికి నీటి సరఫరా మిషన్ ఉంది. వ్యోమగాములంతా తమకు నచ్చిన ఆహారపదార్థాలను ఈ ప్రయాణం కోసం ఎంపిక చేసుకున్నారు.

హ్యాచ్ కింద ఒక చిన్న మెట్టు ఉంటుంది. అది ఎక్సర్‌సైజ్ మిషన్‌లాగా వాడుకునే వీలుంది. వ్యోమగాములు రోజుకు 30 నిమిషాలపాటు కార్డియో, రెసిస్టెన్స్ ట్రైనింగ్‌‌లాంటి ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది.

అయితే, అత్యంత ముఖ్యమైన మరో పరికరం కింద ఉంటుంది. అదే టాయిలెట్. 50 ఏళ్ల కిందట అపోలో వ్యోమగాములకు ఇది అందుబాటులో లేదు. అంతరిక్షంలో శరీర అవసరాలను తీర్చడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.

అయితే, ఇది మరీ ప్రైవేట్ వ్యవహారం కాదు.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఫొటో సోర్స్, NASA

అసలు ప్రయాణం..

చంద్రుడిపైకి వెళ్లి తిరిగొచ్చే వరకు సుమారు 10 రోజులు పట్టొచ్చు. సుమారుగా అని ఎందుకు అంటున్నామంటే, అది మిషన్ లాంచింగ్ సమయం, భూమి – చంద్రుల స్థానాలపై ఆధారపడి ఉంటుంది.

ఈ మిషన్‌లో భాగంగా మొదటిరోజు వ్యోమగాములు భూమి చుట్టూ పరిభ్రమిస్తారు. వారు భూమికి చాలా ఎత్తులో, సుమారు 70,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటారు. ఆ దూరాన్ని ఎలా అర్ధం చేసుకోవాలంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ – ఐఎస్ఎస్) భూమి నుంచి కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అంతరిక్షంలో భార రహిత వాతావరణానికి వారు అలవాటుపడాల్సి ఉంటుంది. అలాగే, తొలిసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్న జెరెమీ హాన్సెన్‌కు ఇది కఠినమైన పాఠం కావొచ్చు.

“మేం అక్కడికి వెళ్లిన తర్వాత అలవాటుపడేందుకు కాస్త సమయం పడుతుందని అనుకుంటున్నా. శూన్యంలో తేలడం, ఎగరడం నేర్చుకోవాల్సి ఉంది, అక్కడి వస్తువులతో ఢీకొనొచ్చు, అందువల్ల నేను కాస్త సాయం తీసుకోవాల్సి రావొచ్చు” అని హాన్సెన్ అంటున్నారు.

స్పేస్‌క్రాఫ్ట్‌లోని కీలకమైన ప్రాణరక్షణ వ్యవస్థలను (లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్) కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిలో టాయిలెట్ కూడా ఒకటి.

వ్యోమగాములకు ఓరియాన్‌ను తొలిసారి టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ప్రయాణం మొదలైన సుమారు 3 గంటల అనంతరం ఇంటెరిమ్ క్రయోజనిక్ ప్రొపల్షన్ స్టేజ్ (ఐసీపీఎస్)గా పిలిచే రాకెట్ అప్పర్ స్టేజ్, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వేరవుతుంది.

అనంతరం, ఓరియాన్ పనితీరును గమనించేందుకు వ్యోమగాములు ఐసీపీఎస్ దగ్గరకు వెళ్లడం, వెనక్కి వచ్చేందుకు ఓరియాన్‌ను స్వయంగా(మాన్యువల్) నడుపుతారు. భవిష్యత్తు మిషన్లలో డాకింగ్ ప్రాక్టీస్ చేసేందుకు ఇదొక అవకాశం.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఆ తర్వాత ఆర్టెమిస్ బృందం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యోమగాములు భూమికి దగ్గరగా ఉండడం వల్ల, మిషన్‌లో పరిష్కరించలేని సమస్యలు ఏవైనా తలెత్తినా అక్కడి నుంచి తిరిగిరావడం సులభం.

ఆ తర్వాత, ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ బర్న్ అని పిలిచే కీలక ప్రక్రియకు అనుమతి ఇచ్చేముందు మిషన్ పూర్తిగా నియంత్రణలో ఉందో లేదో నిర్ధరించుకోవాలి.

ఈ ప్రక్రియలోనే ఓరియాన్ తన ప్రధాన ఇంజిన్‌ను మండించి, గురుత్వాకర్షణ శక్తి నుంచి వేరుపడి, చంద్రుడి వైపు తన పయనాన్ని నిర్దేశించుకుంటుంది.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఫొటో సోర్స్, NASA

ఒకసారి వారు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కిందకు తిరిగిరావడం అంత సులువు కాదు. ఆ దశలో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తిరిగొచ్చే సుదీర్ఘ ప్రయాణంలో ఉంటారు.

ఈ సమయంలో, వ్యోమగాములు స్పేస్‌క్రాఫ్ట్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పర్యవేక్షిస్తూ ఉండడంతోపాటు తమ పరిస్థితిని కూడా పరిశీలించుకుంటూ ఉంటారు.

ఇది సిబ్బందిని ప్రయోగ వస్తువులుగా ఉపయోగించుకునే ఒక అవకాశం. అంతరిక్షంలో, అంతటి సుదూరంలో వారి శరీరాలు ఎలా ప్రభావితమవుతున్నాయనేది నౌకలో చేసే ఈ ప్రయోగాలు చెబుతాయి.

సూర్యుడి నుంచి హానికరమైన, అధిక శక్తి కణాలు వెదజల్లే అవకాశం ఉంటుంది కాబట్టి, రేడియేషన్ ఒక ప్రధానమైన ఆందోళన.

తాము ఎంత రేడియేషన్‌కు గురవుతున్నామో తెలుసుకునేందుకు వ్యోమగాములు డోసిమీటర్ అనే పరికరాన్ని తమతో తీసుకెళ్తారు. స్పేస్‌క్రాఫ్ట్ కింద ఫ్లోర్‌లో ఉండే రేడియేషన్ షెల్టర్‌ను ఉపయోగించడం కూడా ప్రాక్టీస్ చేస్తారు.

ఒకవేళ సౌరతుపాను సంభవించినట్లయితే, ఆ షెల్టర్‌లోకి ఎంత త్వరగా వెళ్లిపోవాలనేది వ్యోమగాములకు తెలిసివుండాలి.

అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవడంలో భాగంగా, ఓరియాన్ క్రూ సర్వైవల్ సిస్టమ్ (ఓసీఎస్ఎస్) అని పిలిచే నారింజ రంగు స్పేస్‌సూట్‌‌లను త్వరగా ధరించడం ప్రాక్టీస్ చేస్తారు.

మిషన్ ప్రయోగ సమయం, తిరిగొచ్చే సమయంలో రక్షణార్థం సిబ్బంది ఈ సూట్‌లు ధరిస్తారు. అలాగే, క్యాప్సూల్‌లో ఏవైనా సమస్యలు తలెత్తినా రక్షణపరంగా ఇవి కీలకంగా పనిచేస్తాయి.

లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో, పీడనాన్ని నియంత్రించగలిగేలా రూపొందిన ఈ సూట్‌లు, వేగంగా ధరించగలిగిన చిన్న స్పేస్‌క్రాఫ్ట్స్ లాంటివి.

చంద్రుడిపైకి వెళ్లేప్పుడు, లేదా తిరిగొచ్చేప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వ్యోమగాములు వెంటనే ఈ సూట్ ధరిస్తారు. వారు భూమికి తిరిగొచ్చే క్రమంలో 6 రోజుల పాటు ప్రాణాలతో ఉండేలా ఈ స్పేస్‌సూట్‌లను రూపొందించారు.

వ్యోమగాములు తమ శరీర బ్యాలెన్స్, కండరాల పనితీరు, మైక్రోబయోమ్‌లో మార్పులతో పాటు కంటి, మెదడు ఆరోగ్యాన్ని అధ్యయనం చేసే పరీక్షల్లోనూ భాగమవుతారు.

అంతరిక్షంలో శరీర రోగనిరోధక వ్యవస్థలు బలహీనపడే అవకాశం ఉండడంతో, ఈ ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో, తిరిగొచ్చిన తర్వాత వారి లాలాజలం నమూనాలను ఒక ప్రత్యేకమైన పేపర్‌పై అద్ది సేకరిస్తారు.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

చంద్రుడితో ముఖాముఖి

ఈ ప్రపంచం అర్ధ శతాబ్దానికి పైగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. మానవాళి మరోసారి చంద్రుడి దగ్గరకు వెళ్తున్న సమయం ఇది.

వ్యోమగాములు చంద్రుని ఉపరితలం నుంచి సుమారు 6,500 నుంచి 9,500 కిలోమీటర్ల దూరంలో, మనం భూమి నుంచి చూడలేని అవతలి వైపు దానిచుట్టూ ప్రయాణిస్తారు.

చంద్రుడిని మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా ఓరియాన్ చంద్రుని వైపు ఉంటుంది. వ్యోమగాములకు చంద్రుడిని చూసేందుకు, ఫోటోలు తీసేందుకు, జియాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు 3 గంటల సమయం ఉంటుంది. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై దిగేందుకు ప్రణాళికలు, సన్నాహాలకు సాయపడుతుంది.

అక్కడి నుంచి, ఓరియాన్ కిటికీల ద్వారా ముందుభాగంలో చంద్రుడిని దగ్గరగా, వెనుకనుంచి భూమిని దూరంగా ఏకకాలంలో చూడగలుగుతారు.

తమ మిషన్‌లోని ఈ ప్రత్యేక క్షణం కోసం తమవెంట కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తీసుకెళ్లేందుకు ప్రతి ఆస్ట్రోనాట్‌కూ అనుమతి ఇచ్చారు. విక్టర్ గ్లోవర్ బైబిల్‌తో పాటు కొన్ని కుటుంబ వారసత్వ వస్తువులను తీసుకెళ్తున్నారు. క్రిస్టీనా కోచ్ తన ఆప్తులు రాసిన ఉత్తరాలను, జెరెమీ హాన్సెన్ తన భార్య, ముగ్గురు కుమార్తెలకు సంబంధించిన చంద్రుడి ఆకారపు లాకెట్లు తీసుకెళ్తున్నారు.

రీడ్ వైజ్‌మాన్ చాలా సాధారణ వస్తువులను తీసుకెళ్తున్నారు.

“నా దగ్గర ఒక ఖాళీ కాగితం, పెన్ను, పెన్సిల్ ఉన్నాయి. వాటితో నా అనుభవాలు, ఆలోచనలు ఎప్పుడెప్పుడు రాద్దామా అని చూస్తున్నా. ఎలా ఉంటుందో తెలీదు, ముందుగానే ఏవేవో అభిప్రాయాలతో వెళ్లాలనుకోవడం లేదు” అని ఆయన అన్నారు.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

అయితే, చంద్రుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు వ్యోమగాములు ఆశ్చర్యంగా, అద్భుతంగా చూస్తూ ఉంటే.. మిషన్‌ను పర్యవేక్షించే వారికి, ఈ మిషన్‌‌ను ఆసక్తిగా గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

వ్యోమగాములు చంద్రుడి అవతలి వైపు ప్రయాణిస్తున్న సమయంలో, దాదాపు 30 నుంచి 50 నిమిషాల పాటు భూమితో సంబంధాలను కోల్పోతారు.

“మనం భూమితోనూ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న మన స్నేహితులతోనూ మాట్లాడలేకపోయినప్పటికీ.. మనకు సిగ్నల్స్ వచ్చి, అందరితోనూ తిరిగి టచ్‌లోకి రావాలని యావత్ ప్రపంచం ఆశిస్తూ ప్రార్థిస్తే ఎంత బావుంటుందో” అని విక్టర్ గ్లోవర్ అన్నారు.

మిషన్ పర్యవేక్షిస్తున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని, వారితో సంబంధాలు పునరుద్ధరణ జరిగిన అనంతరం, వ్యోమగాముల తిరుగుప్రయాణానికి సమయం ఆసన్నమవుతుంది.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఫొటో సోర్స్, NASA

ప్రమాదకరమైన తిరుగు ప్రయాణం

తిరుగు ప్రయాణానికి మరో నాలుగు రోజులు పడుతుంది. కానీ, ఈ మిషన్ చివరి దశ అత్యంత ప్రమాదకరమైనది.

ఈ చివరి దశలో స్పేస్‌క్రాఫ్ట్‌లోని మిగిలిన భాగం నుంచి సిబ్బంది ఉండే భాగం (మాడ్యూల్) వేరవుతుంది. క్యాప్సూల్ తిరగడం మొదలవుతుంది, అది భూవాతావరణంలోకి ప్రవేశించేప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకుని, వ్యోమగాములను లోపల సురక్షితంగా ఉంచుతుంది.

ఈ అంతరిక్ష నౌక గంటకు సుమారు 40,000 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి దూసుకొస్తూ, సుమారు 2,700 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉండే ఉష్ణోగ్రతలో సగం.

మొదటి మానవ రహిత ఆర్టెమిస్ మిషన్‌లో హీట్ షీల్డ్‌ తీవ్రంగా దెబ్బతినడంతో దానిపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అయితే, భూవాతావరణంలోకి ప్రవేశించే కోణాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించామని ఇంజనీర్లు దీమాగా ఉన్నారు.

అంతరిక్ష నౌక ఒకసారి భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత, దాని వేగాన్ని తగ్గించేందుకు పలుదఫాలుగా పారాచూట్లు తెరుచుకుంటాయి.

వ్యోమగాములు పసిఫిక్ సముద్రంలో, కాలిఫోర్నియా తీరానికి సమీపంలో నెమ్మదిగా ల్యాండ్ అవుతారు. అక్కడ రికవరీ బృందం సిద్ధంగా ఉంటుంది.

నాసా, ఆర్టెమిస్ 2, ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్, అమెరికా, చంద్రుడి మిషన్

ఫొటో సోర్స్, NASA

ఈ క్యాప్సూల్ నిటారుగా లేదా తల్లకిందులుగా, లేదా పక్కకు వంగి కూడా ల్యాండ్ కావొచ్చు. ఆ వెంటనే క్యాప్సూల్ నిటారుగా వచ్చేందుకు, అందులోని సిబ్బంది సురక్షితంగా బయటకు రావడానికి వీలుగా ఆరెంజ్ బ్యాగులు సాయపడతాయి.

ఇంటికి తిరిగా రావడమే ఈ మిషన్‌లో తాను అత్యంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అంశమని విక్టర్ గ్లోవర్ చెప్పారు.

లక్ష్యం పూర్తయ్యాక, వ్యోమగాములు భూమ్మీదకు తిరిగొస్తారు. మళ్లీ ఈ నేలపై నడవడం.. తమ జీవితకాల ప్రయాణాన్ని గుర్తుచేసుకునే మొదటి క్షణం.

వారు ఒక గొప్ప బృందంలో సభ్యులవుతారు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం 24 మంది వ్యోమగాములు మాత్రమే చంద్రుడి చుట్టూ ప్రయాణించారు.

కానీ, ఇది ఆర్టెమిస్ మిషన్లకు కేవలం ఆరంభం మాత్రమే. అక్కడ సేకరించిన సమాచారం, శాస్త్రీయ విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఆ తర్వాతి మిషన్లు మరింత సవాల్‌తో కూడుకున్నవి. ఈసారి మానవులను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్లడమే కాదు, అక్కడ నివసించేలా చేయడమే ప్రధానమైన విషయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)