Home జాతీయ national telgu ఆర్టెమిస్ 2 మిషన్‌.. 9 ప్రశ్నలు, సమాధానాలు

ఆర్టెమిస్ 2 మిషన్‌.. 9 ప్రశ్నలు, సమాధానాలు

16
0

SOURCE :- BBC NEWS

నాసా ఆర్టెమిస్ 2 మిషన్

ఫొటో సోర్స్, Getty Images

నాసా ఆర్టెమిస్ 2 మిషన్ తిరిగి భూమిపైకి వస్తోంది.

సుమారు 50 ఏళ్ల తరువాత చంద్రుడి వైపు నాసా లాంచ్ చేసిన తొలి మిషన్ ఇది.

ఆర్టెమిస్ 2 ఆస్ట్రోనాట్‌లు కాకుండా వేరే ఎవ్వరూ ఇంతవరకు భూమి నుంచి అంత దూరం ప్రయాణించలేదు.

నాసా ఆర్టెమిస్ ప్రొగ్రామ్‌ ఎన్నో ఏళ్ల కృషి. వేలాది మంది ప్రజలు దీనిలో భాగమయ్యారు. ఇప్పటి వరకు సుమారు 93 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,64,877 కోట్లు) వెచ్చించారు.

ఇంతకూ ఏమిటీ మిషన్? ఎవరెవరు వెళ్లారు? భూమితో ఆర్టెమిస్ సిబ్బందికి ఎప్పుడు సంబంధాలు తెగిపోయాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. ఆర్టెమిస్ 2 మిషన్ ఏంటి?

1960లు, 1970ల్లో అపోలో మిషన్లు తర్వాత మొదటిసారి చంద్రుడిపైకి తొలిసారి మానవులను తీసుకెళ్లడమే ఆర్టెమిస్ 2 ఉద్దేశం.

ఈ మిషన్‌లో నాసా అతిపెద్ద స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) రాకెట్‌, ఓరియన్ స్పేస్ క్యాప్సుల్‌తో చేసే తొలి మానవ సహిత విమానం ఉంది.

ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి 4 లక్షల 6 వేల 771 కిలోమీటర్లు ప్రయాణించింది.

అత్యంత దూరం అంతరిక్షంలోకి వెళ్లిన మానవసహిత విమానంగా ఇది రికార్డు సృష్టించింది.

క్యాప్సూల్‌ను భూమి కక్ష్యలోకి ఎలా ప్రవేశపెట్టాలి, భవిష్యత్తులో చంద్రునిపై దిగడానికి అంతరిక్ష నౌకను సరిగ్గా ఎలా సిద్ధం చేయాలి వంటి విషయాలతో సహా, ఓరియన్ ఎలా పనిచేస్తుందో ఈ మిషన్‌లో వ్యోమగాములు పరీక్షించాల్సి ఉంది.

ఆర్టెమిస్ 2

ఫొటో సోర్స్, Getty Images

2. ఆర్టెమిస్ 2ను లాంచ్ ఎప్పుడు చేశారు?

2026, ఏప్రిల్ 1, బుధవారం సాయంత్రం 6:35 గంటలకు (భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 2, తెల్లవారుజామున సుమారు 4 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లో కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఆర్టెమిస్ 2 మిషన్‌కు చెందిన రాకెట్ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకుపోయింది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ప్రక్రియ పూర్తయిందని నాసా నివేదించింది. వ్యోమగాములందరూ బాగున్నారని చెప్పింది.

ఆర్టెమిస్ 2

ఫొటో సోర్స్, Getty Images

3. ఆర్టెమిస్ 2 చంద్రుడిపై దిగిందా?

లేదు. వాస్తవానికి, 2028లో చేపట్టే ఆర్టెమిస్ 4 మిషన్‌లో చంద్రునిపై దిగడానికి వీలుగా ఇప్పుడీ మిషన్‌ను నిర్వహిస్తున్నారు.

10 రోజుల ఆర్టెమిస్ 2 మిషన్‌లో.. చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములు దిగరు. బదులుగా, వారు చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ, భూమికి మునుపెన్నడూ వెళ్లనంత దూరానికి వెళ్తారు.

ఈ మిషన్‌లో భాగంగా చంద్రునిపై ఎవరూ దిగరు. ఓరియన్ క్యాప్సుల్ కేవలం దాని చుట్టూ పరిభ్రమిస్తుంది.

ఆర్టెమిస్ 2 మిషన్‌

ఫొటో సోర్స్, Getty Images

4. లాంచ్ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?

2026 ఏప్రిల్ ముగియడాని కంటే ముందే, ఆర్టెమిస్ 2 లాంచ్ చేయాలని నాసా 2024 డిసెంబర్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.

వైట్ డ్రెస్ రిహార్సల్‌ అని పిలిచే ప్రీ-ఫ్లయిట్ టెస్ట్ సమయంలో లాంచ్ టవర్‌ను రాకెట్‌లోకి అనుసంధానించే భాగంలోకి హైడ్రోజన్ ఇంధనం లీక్ కావడం వల్ల ఫిబ్రవరిలో జరగాల్సిన లాంచ్ రద్దయింది.

హీలియం లీక్ అవ్వడం వల్ల మార్చిలో జరగాల్సిన లాంచ్ కూడా ఆగిపోయింది.

ఆ తర్వాత స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయం) ఈ రాకెట్ చివరికి నింగిలోకి ఎగిరింది.

5. డ్రైవింగ్ టీమ్‌లో ఎవరున్నారు?

ఆర్టెమిస్ 2 సిబ్బందిలో నలుగురు సభ్యులున్నారు. వారిలో నాసా కమాండర్ రీడ్ వైజ్‌మన్, పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్టు క్రిస్టినా కోచ్‌ ఉన్నారు. అదనంగా కెనడీ స్పేస్ ఏజెన్సీతో సంబంధం ఉన్న మరో మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్ కూడా ఈ మిషన్‌లో భాగమయ్యారు.

ఆర్టెమిస్ 2 శుక్రవారం ఒక ముఖ్యమైన ఇంజిన్ బర్న్‌ను పూర్తి చేసింది.

ఈ బర్న్ పూర్తి చేసిన తర్వాత తొలి సందేశం విడుదల చేసిన కెనడియన్ ఆస్ట్రోనాట్ జెరెమీ హాన్సెన్.. ”మానవాళి మనం ఏం చేయగలమో మరోసారి నిరూపించింది” అని అన్నారు.

“భవిష్యత్తుపై మీకున్న ఆశలే ఇప్పుడు చంద్రుడు చుట్టూ ప్రదక్షిణ చేసే ఈ ప్రయాణంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి” అని అన్నారు.

“చంద్రుడి వైపు మేం చేస్తోన్న ప్రయాణంలో ఇక్కడ మేమందరం క్షేమంగా ఉన్నాం” అని హాన్సెన్ నాసా లైవ్ స్ట్రీమ్‌లో తెలిపారు.

ఆర్టెమిస్ 2 మిషన్‌

ఫొటో సోర్స్, Getty Images

6. సిబ్బంది నివసించే పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఈ మిషన్‌లోని నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సుల్‌లో సమయాన్ని గడుపుతున్నారు. వారు చిన్న ప్రదేశంలోనే వ్యాయామం చేయడం, తినడం, నిద్రపోవడం, పనిచేసుకోవడం చేస్తున్నారు.

వ్యోమగామికి తాగడానికి, తమ సొంత ఆహారం తయారు చేసుకునేందుకు ఒక నీటి డిస్పెన్సర్ ఉంది.

ఈ ప్రయాణం కోసం అందరూ తమకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకున్నారు. హ్యాచ్ కింద ఉన్న మెట్టు ఫ్లైవీల్ ఎక్సర్‌సైజు మిషన్‌లా పనిచేస్తుంది.

ఈ యాత్రకు ముందు వ్యోమగాములు ప్రతిరోజూ ముఫ్పై నిమిషాల పాటు వ్యాయామం చేస్తారని ప్రకటించారు.

అన్నిటికన్నా ముఖ్యమైనది టాయిలెట్, అది ఫ్లోర్ కింద ఉంటుంది.

టాయిలెట్ ఉపయోగించేటప్పుడు స్థల సమస్యలను అధిగమించేలా దీన్ని రూపొందించారు.

7. అంతరిక్షం నుంచి ఏ చిత్రాలు పంపారు?

చంద్రుడి దిశగా వెళుతున్న ఆర్టెమిస్ 2 సిబ్బంది, అంతరిక్షం నుంచి తీసిన భూమి హై రిజల్యూషన్ చిత్రాలను నాసా విడుదల చేసింది.

మిషన్ కమాండర్ రీడ్ వైజ్‌మన్ అద్భుతమైన చిత్రాలను తీశారని నాసా ప్రకటించింది.

“హలో వరల్డ్” పేరుతో తొలి చిత్రాన్ని నాసా పోస్ట్ చేసింది. తొలి చిత్రంలో అట్లాంటిక్ మహాసముద్రం, దాని చుట్టూ వాతావరణం నుంచి వెలువడే మసక కాంతితో కనిపిస్తుంది.

ఆ సమయంలో సూర్యుడిని భూమి పాక్షికంగా కప్పేయడం కనిపిస్తుంది. అలాగే, రెండు ధ్రువాల దగ్గర ఆకుపచ్చ అరోరా కాంతులు కూడా కన్పిస్తున్నాయి.

ఈ చిత్రంలో భూమి తలకిందులుగా కనిపిస్తుంది. ఎడమ వైపున పశ్చిమ సహారా ఎడారి, కనిపిస్తుండగా.. కుడి వైపున దక్షిణ అమెరికా తూర్పు భాగం కనిపిస్తుంది.

ఆర్టెమిస్ 2 మిషన్‌

ఫొటో సోర్స్, Getty Images

8. నలభై నిమిషాల పాటు సంబంధాలు తెగిపోయాయి..

ఆర్టెమిస్ సిబ్బందికి భూమితో కొద్దిసేపు పాటు సంబంధాలు తెగిపోయాయి.

వ్యోమగాములు చంద్రుడి వెనక్కి వెళ్లినప్పుడు అంతరాయం ఏర్పడింది.

స్పేస్‌క్రాఫ్ట్‌కు, భూమికి మధ్య కమ్యూనికేషన్‌ జరిపే రేడియో, లేజర్ సిగ్నల్స్‌ను చంద్రుడు అడ్డుకున్నాడు.

దాదాపు 40 నిమిషాల పాటు నలుగు వ్యోమగాములు భూమితో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఒంటరిగా ఉన్నారు.

””45 నిమిషాల పాటు భూమితో సంబంధం తెగిపోయిన తర్వాత, చంద్రుని అవతలి వైపు నుంచి తిరిగి వచ్చి భూమిని మళ్లీ చూడటమే అత్యంత ముఖ్యమైన క్షణం అని భావిస్తున్నాను” అని ఆస్ట్రోనాట్ క్రిస్టినా కోచ్ అన్నారు.

9. ఈ మిషన్ ఎందుకంత ముఖ్యమైనది?

అంతరిక్షంలో మనకు అత్యంత సమీపంలో ఉన్న పొరుగు గ్రహం చుట్టూ వారు చేసే ప్రయాణం, భవిష్యత్తులో చంద్రునిపై దిగడానికి, చివరికి అక్కడ ఒక స్థావరాన్ని నిర్మించడానికి మార్గం సుగమం చేస్తుంది.

50 సంవత్సరాల క్రితం, మానవులు మొట్టమొదటిసారిగా చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టడంతో అమెరికా అపోలో మిషన్లు చరిత్ర సృష్టించాయి.

చంద్రుని ఉపరితలం పొడిగా, ధూళితో నిండి, నిస్సారంగా కనిపించినప్పటికీ, వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

“భూమిపై మనం కనుగొనే మూలకాలే చంద్రుడిపై కూడా ఉన్నాయి” అని నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన ప్లానెటరీ సైంటిస్ట్, ప్రొఫెసర్ సారా రస్సెల్ అన్నారు.

”ఉదాహరణకు, అత్యంత అరుదైన భూమి మూలకాలు. ఇది భూమిపై చాలా అరుదైనవి. చంద్రునిపై కొన్ని ప్రాంతాల నుంచి వెలికితీయడానికి అక్కడ అవి సరిపడా పరిమాణంలో ఉండవచ్చు” అని చెప్పారు.

వీటిలో ఇనుము, టైటానియం వంటి లోహాలతో పాటు, సూపర్‌కండక్టర్ల నుంచి వైద్య పరికరాల వరకు అనేక వాటిలో ఉపయోగించే హీలియం కూడా ఉన్నాయి.

అయితే, అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన వనరు నీరు.

“చంద్రునిలోని కొన్ని ఖనిజాలలో నీరు నిక్షిప్తమై ఉంది. అలాగే ధ్రువాల వద్ద కూడా గణనీయమైన పరిమాణంలో నీరు ఉంది” అని రస్సెల్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)