SOURCE :- BBC NEWS
ఓ రోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది. నా రాకను ఇద్దరూ పట్టించుకోలేదు.
ఆ అబ్బాయిని మొదటిసారి చూడటంతో, ఎవరా అబ్బాయి అని అడిగాను?
‘నా ఫ్రెండ్, ఆన్లైన్లో ఈ మధ్యనే పరిచయం అయ్యాడు’ అని నా కూతురు నుంచి సమాధానం వచ్చింది. నాకు గుండె చాలా వేగంగా కొట్టుకుంది. వెంటనే అబ్బాయిని వివరాలు అడిగాను. అబ్బాయి తండ్రి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉంటారని, తండ్రి తమిళం, తల్లి తెలుగు వారని చెప్పాడు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ అబ్బాయి నాతో కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని మా అమ్మాయి అనగానే, అసలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
ఆ సమయంలో నా భర్త ఆఫీసు పనిపై నెదర్లాండ్స్ వెళ్లారు. ఇది కోవిడ్ లాక్ డౌన్ ముగిసిన తర్వాత జరిగిన విషయం.
పిల్లల పెంపకంలో, ఎదుగుదలలో, ప్రవర్తనలో టెక్నాలజీ తెచ్చిన మార్పులను, తనకు ఎదురైన అనుభవాలను హైదరాబాద్‌కు చెందిన 50 ఏళ్ల వినీల (పేరు మార్చాం) బీబీసీతో పంచుకున్నారు.
టెక్నాలజీ బంధాలను దూరం చేస్తోందా?
‘‘టెక్నాలజీ బంధాలను బలపరుస్తోందా, మనుషులను దూరం చేస్తోందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది. కానీ, మన చిన్న ప్రపంచాన్ని మాత్రం కొన్ని మైళ్ల దూరానికి తీసుకుపోతోంది.
పరిస్థితులు చేతులు దాటుతున్నాయని అనిపించింది. కుదరదు అంటే ఇద్దరూ వినే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించలేదు.
నా భర్తతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదంతా తెలిస్తే దూరంగా ఉన్న ఆయన ఎలా స్పందిస్తారో అని భయమేసింది. ఓ రకమైన అసహనం ఆవహించింది.
ఏంటిది అని అరిచాను. కానీ, నా అరుపులు వాళ్ల చెవులకెక్కలేదు.
ఏం తప్పు చేస్తున్నాం? ఇదంతా నార్మల్ అన్నారు.
నా దగ్గర సమాధానం లేదు.
ఒక్క క్షణం కొన్ని వేల ప్రశ్నలు ముసిరాయి.’’
పెంపకంపై సందేహాలు
‘‘చుట్టాలెవరైనా ఇంటికి వస్తే ఏం చెప్పాలి? అసలు ఈ అబ్బాయి ఎవరు? ప్రేమిస్తోందా? జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనా? వాళ్ల తల్లిదండ్రులు ఈ ఊళ్లోనే ఉంటే మన ఇంట్లో ఉండటం ఎందుకు? అంత ధైర్యంగా మా ఇంట్లో అడుగు పెట్టి ఉండటానికి ఏ మాత్రం సంశయం చూపించని ఆ అబ్బాయి తెగువ అర్థం కావడం లేదు.
ఎవరికీ చెప్పలేను. ఓ సందిగ్ధంలో పడిపోయాను. ప్రపంచం తలకిందులైనట్లు, అగాథంలోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది.
నేనెక్కడ తప్పు చేశాను? నా పెంపకంలో లోపం ఏమిటి? ఇలా సవాలక్ష ప్రశ్నలు చుట్టుముట్టాయి.
ఏం చేయాలో అర్థం కాక, అబ్బాయి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడాను.
వాళ్లు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేనే సాధారణ విషయాన్ని అసాధారణంగా చూస్తున్నట్లు మాట్లాడారు. ఇదంతా సినిమాల ప్రభావమా? పాశ్చాత్య ధోరణి పోకడో అర్థం కాలేదు. నీరసం వచ్చేసింది.’’
‘‘మా చిన్నతనంలో ఇలా లేదు’’
‘‘నేను, నా భర్త కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నాం. మా అమ్మ, నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇద్దరం చదువుకున్న కుటుంబం నుంచే వచ్చాం. నాదీ ప్రేమ వివాహమే. కానీ, ఓ అపరిచితుడిని ఇంటికి తీసుకొచ్చి, ‘మన ఇంట్లో మనతోనే కొన్ని రోజులు ఉంటాడు’ అని చెప్పడం మాత్రం నాకు ఒక షాక్‌లా అనిపించింది.
నా చిన్నప్పుడు మొబైల్ ఫోన్లు లేవు, స్కూలు లేదా కాలేజీ నుంచి ఇంటికి వచ్చి అమ్మానాన్నలతోనే గడిపేవాళ్లం. వాళ్లు తిట్టినా, మందలించినా, నేను అలిగినా అదంతా కొన్ని క్షణాలు మాత్రమే.
వేర్వేరు గదులు లేవు. ఇంటి హాల్లోనే చదువులు ఉండేవి. మేం రహస్యంగా ఏ పని చేయాలన్నా కష్టంగానే ఉండేది. ఎప్పుడూ అమ్మా, నాన్న, లేదా ఇంట్లో పెద్దవాళ్ల కళ్లు మాపై, మా చర్యలపై ఉండేవి. మా అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా వాళ్లు మమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్లు ఏ రోజూ మేం ఫీల్ అవ్వలేదు. వాళ్లు పడుతున్న కష్టం పట్ల మాకు చాలా గౌరవం ఉండేది. తల్లిదండ్రుల మాటకు చాలా విలువ ఇచ్చేవాళ్లం.
ఇప్పుడు నా కూతురితో పరిస్థితి వేరు. 14 ఏళ్లకే మొబైల్ ఫోన్ కొనివ్వాల్సి వచ్చింది. స్కూలులో పాఠాలు నేర్చుకోవడానికి, రీసెర్చ్‌కి మొబైల్ ఫోన్ లేకపోతే ఎలా అని అడగడంతో, తోటి పిల్లల దగ్గర ఎక్కడ తక్కువైపోతారో, చదువులో ఎక్కడ వెనకబడిపోతారో అనే భయంతో స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టాం.
మొబైల్ చేతిలోకొచ్చాక వాళ్ల స్నేహాలు ఎవరితో ఎలా ఉంటున్నాయో అంచనా వేయలేకపోతున్నాం. సైబర్ నేరాలు, సైబర్ మోసాలు, ఆడపిల్లలను మోసం చేయడం, అపరిచితులతో స్నేహాలు, డేటింగ్ ఇవన్నీ మొబైల్ ఫోన్ల వల్ల పెరుగుతున్నాయేమో అనిపిస్తోంది.
కానీ, టెక్నాలజీని ఆపలేం కదా.’’
‘‘ టెక్నాలజీ పరిచయాలు ముదిరి ఇవాళ ఇంట్లోకి నేరుగా ఒక అపరిచితుడు వచ్చి చేరిపోవడం, నేను గొంతెత్తలేకపోవడం, ఎవరిని నిందించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను.
గట్టిగా మాట్లాడితే, ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటాం లాంటి మాటలు అంటారేమోననే భయం.
నెమ్మదిగా చెబితే ఎదురు తిరగడం, ఇంట్లో భోజనం మానేసి, స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు పెట్టుకోవడం, తలుపులు వేసుకుని రూములో ఉండటం, గంటలు గంటలు అపరిచితులతో చాట్ చేయడం.. ఇదీ పరిస్థితి.
ఇంకా గట్టిగా అడిగితే, ఇంట్లో ఖరీదైన వస్తువులను విరగ్గొట్టే స్థాయికి కూడా వెళ్లింది.’’
వివాహేతర సంబంధాలు
ఇటీవల మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటనలో ఓ వ్యక్తి వివాహేతర సంబంధంలో, భాగస్వామితో గొడవపడి, చివరకు ఆమెను హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరూ చిన్నప్పటి స్నేహితులే అయినప్పటికీ, చాలా కాలం తర్వాత ఫేస్బుక్లో కలుసుకున్నారు. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ నిర్వహించిన ఓ అధ్యయనంలో తరచుగా టెక్స్ట్ సందేశాలు పంపుకునే జంటలు తమ సంబంధాల పట్ల సంతృప్తిని పొందుతారని తెలిసింది. ఆన్ లైన్ లో సులభంగా కనెక్ట్ అయ్యే మార్గాలు ఉండటంతో వివాహేతర సంబంధాల్లోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉందని కూడా ఈ అధ్యయనంలో తేలింది. భారత్‌లో ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 45% మంది ఆన్లైన్ సంబంధాలను పెట్టుకుని తమ భాగస్వాములను మోసం చేస్తూ ఉంటారని వెల్లడైంది.
“నేను, నా భర్త ఇద్దరూ కార్పొరేట్ ఉద్యోగులమే. ఒక్కోసారి మాకు నైట్ షిఫ్టులు కూడా ఉండేవి. కానీ, మా ఉద్యోగాలే పిల్లలు మాకు దూరమవ్వడానికి కారణం అనుకుంటే.. మా అమ్మా నాన్న కూడా ఉద్యోగులే కదా. ఇప్పటికీ నాకు మా అమ్మ అంటే ప్రేమ, గౌరవం ఉన్నాయి” అని అన్నారు వినీల.
‘‘ఇప్పుడంతా గూగుల్లోనే’’
“టెక్నాలజీ చేతుల్లోకి రాగానే, ప్రపంచం వాళ్ల చేతుల్లోకి వచ్చేసింది. మా చిన్నప్పుడు, లోకం గురించి ప్రశ్నలు వస్తే, పెద్దవాళ్లను అడిగేవాళ్లం. ఇప్పుడు పిల్లలు గూగుల్‌ని అడుగుతున్నారు. అదే తేడా!
మొదట టీవీ రిమోట్ అసహనానికి నాంది వేస్తే, రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు దాన్ని పరాకాష్టకు తీసుకెళ్లాయి. సోఫాలో ఒక ఛానెల్ నచ్చకపోతే, మరో ఛానెల్‌కు మారడం, స్క్రీన్ పై ప్రకటనలు చూడాలంటే అసహనం, ఈ మధ్యలోనే పక్క ఛానెల్లో ఏమొస్తుందో చూడాలి. ఇలా చేస్తుంటే ఏది గ్రహిస్తారు? ఏది అర్థమవుతుంది?
మా అమ్మాయి విషయానికి వస్తే, నా తల్లిదండ్రులు మాదిరిగానే స్నేహంగా ఉండాలని అనుకున్నాను. కానీ, ఆ చనువును వాళ్లు అవకాశంగా తీసుకున్నారని అనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి ఉండే తరం బహుశా ఈ జనరేషన్‌తోనే ముగిసిపోతుందేమోనని భయం వేస్తోంది.
ఫోన్లు, టీవీలు పిల్లలకు ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. నేను మాట్లాడుతూ ఉంటాను, కానీ, మా అమ్మాయి వేరే ఫోన్లో మాట్లాడుతూ, ల్యాప్ టాప్‌లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ ఎందుకు అంటే ఆఫీస్ మీటింగ్ అంటుంది. నాకు ఏం అనాలో అర్థం కాదు.
ఇంటికి చుట్టాలు, స్నేహితులు వస్తే, వాళ్లతో గడపడానికి, కనీసం ఐదు నిమిషాలు పలకరించేందుకు కూడా ఓపిక ఉండటం లేదు. అవతలి వ్యక్తులు మాట్లాడుతుంటే, వీళ్లు ఫోన్లు చూసుకుంటూ, ఇంటికొచ్చిన వారి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది పెంపకం తప్పో, టెక్నాలజీ తప్పో అర్థం కావడం లేదు.’’
‘‘మాటలు లేవు’’
‘‘ఇంట్లో అందరూ కలిసి భోజనం చేసే సంస్కృతి ఎప్పుడో పోయింది. దీంతో, మా మధ్య మాటలే ఉండవు. డబ్బులు కావాలంటే మాత్రం ప్రేమగా ఓ ఐదు నిమిషాలు మాట్లాడతారు. మాకు కూడా అర్థమైపోతోంది.. ఏదో అవసరముందని. ఈ టెన్షన్ పడలేక ఈ మధ్యనే ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంట్లో ఉంటున్నాను. కానీ పరిస్థితి ఇప్పుడు నా చేతుల్లో లేదు. ఫోన్ వాళ్ల జీవితంలో భాగమైపొయింది.
ప్రతి బంధాన్నీ ఓ డీల్లా చూడటం అలవాటైపోయింది. నాకు భయం వేస్తూ ఉంటుంది. మానవ సంబంధాలు ఎంత యాంత్రికంగా మారిపోయాయి అని. వాళ్లు బాగుండాలని మేం చూపించే ప్రేమను వాళ్లు మా బలహీనతగా చూస్తున్నారు.
ఈ జనరేషన్ అసాధారణ ప్రవర్తనను సాధారణం చేశారు, అంతే!” అని నాతో ఫోన్లో మాట్లాడుతూ ఒక నిట్టూర్పు విడిచారు వినీల.
“వాళ్లు ఈ పరిచయాలతో చాలా సంతోషంగా ఉన్నామని అనుకోవచ్చు, కానీ దీర్ఘ కాలంలో ఒత్తిడికి, అసహనానికి లోనవుతారని నాకనిపిస్తోంది.
క్షణకాలపు ఆకర్షణలో ఏర్పడే పరిచయాలకు శాశ్వతత్వం ఉండదు. మా అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఆన్లైన్ చాట్లు, ఇంట్లో కొన్ని రోజుల పాటు గడిపిన తర్వాత ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. మా అమ్మాయితో గొడవ పెట్టుకుని ఆ అబ్బాయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మా అమ్మాయికి అప్పుడు అర్థమైంది… ఒక టాక్సిక్ బంధంలోంచి సులభంగానే బయటపడ్డాను అని. ఇవి చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఆ సమయంలో ఎంత దు:ఖం, వేదన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు.
ఇవి ఎటు దారి తీస్తాయో అనే భయం నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది” అని వినీల వివరించారు.
నిజమైన బంధాలకు ఆటంకం
ఇటీవల సుప్రీం కోర్టు టీనేజ్ ప్రేమలను నేరంగా పరిగణించగలమో లేదో చెప్పడం కష్టం అని పేర్కొంది. 17 ఏళ్ల అమ్మాయితో పారిపోయిన ఒక 22 ఏళ్ల అబ్బాయికి బెయిల్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
తన కూతురిని మోసం చేసి తీసుకెళ్లిపోయారని అమ్మాయి తండ్రి నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ అబ్బాయిని అరెస్టు చేశారు.
సైబర్ సైకాలజీ, బిహేవియర్ అండ్ సోషల్ నెట్ వర్కింగ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఆన్లైన్లో కలిసిన జంటల సంబంధాలు ఆఫ్‌లైన్‌లో కలిసిన వారి కంటే భిన్నంగా ఎలా ఉంటాయనే అంశాలను పరిశీలించింది.
ఈ అధ్యయనంలో ఆన్లైన్ డేటింగ్లో ఏర్పడే సంబంధాలు విఫలమవుతాయని, బలహీనంగా ఉంటాయని చెప్పడం తప్పు అని అధ్యయనకారులు పేర్కొన్నారు.
“నేటి యువత సంబంధాలను ఏర్పరచుకోవడంలో, నిర్వహించడంలో టెక్నాలజీ కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు వాట్సాప్, సిగ్నల్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు తక్షణ కనెక్టివిటీని అందిస్తున్నాయి. దూరంతో సంబంధం లేకుండా సులువుగా కమ్యూనికేట్ చేయడానికి, కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతున్నాయి.
మరోవైపు ఈ కనెక్టివిటీని అధికంగా ఉపయోగించడం నిజమైన బంధాలకు ఆటంకంగా మారవచ్చు. ఒంటరితనం, అసంతృప్తికి కారణం కావచ్చు. మితిమీరిన స్క్రీన్ టైం వంటి అంశాలు ముఖాముఖి సంబంధాలను తగ్గిస్తాయి. దీనివల్ల సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ మందగించవచ్చు. కాబట్టి, టెక్నాలజీని బ్యాలెన్స్‌గా వాడుకోవాలని యువత గుర్తించాలి” అని హైదరాబాద్ కు చెందిన సైకాలజిస్ట్ విశేష్ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS