SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Chickens – generic
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకడంతో 23,312 కోళ్లను చంపి, పూడ్చిపెట్టినట్లు ఆయా జిల్లాల పశు సంవర్థక శాఖ అధికారులు తెలిపారు.
ఇటీవల అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని పలు గ్రామాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించడంతో అప్రమత్తమైన పశు సంవర్థక శాఖ అధికారులు, అక్కడి కోళ్ల నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ అనుబంధ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్‌డీ) ల్యాబ్‌కు పంపించారు.
పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంభంవారిపల్లి గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధరించారు.
అక్కడి కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ (ఎస్‌వోపీ) ప్రకారం పూడ్చి పెట్టామని డాక్టర్ గుణశేఖర్ పిళ్లై చెప్పారు.
పౌల్ట్రీ ఫాంలు బయోసెక్యూరిటీ ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు. బయటి వ్యక్తులు, ఇతరుల వాహనాలు ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు.
ఫారాల్లోని కోళ్లు అసాధారణంగా చనిపోతున్నా, వాటి ముక్కుల్లోంచి ద్రవాలు కారడం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయా ఫౌల్ట్రీ యజమానులకు అధికారులు సూచించారు.

ఫొటో సోర్స్, ANI
కొన్ని ప్రాంతాల్లోనే బర్డ్ ఫ్లూ లక్షణాలు…
అన్నమయ్య జిల్లాలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి చెందినట్లు నిర్ధరణ అయిన తర్వాత ఫిబ్రవరి 9 నుంచి అధికారులు వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు.
బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు ఎలా సాగుతున్నాయో డాక్టర్ కె గుణశేఖర్ పిళ్లై బీబీసీకి వివరించారు.
బర్డ్ ఫ్లూ సోకిన మండలాల్లో పశుసంవర్ధక శాఖ, పశువైద్యుల ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో కోళ్లను చంపి, వాటిని పూడ్చి పెడుతున్నట్లు తెలిపారు.
”సదుం మండలంలోని రెండు ఫారాల్లో ఫిబ్రవరి 4న శాంపిల్స్ కలెక్ట్ చేసి భోపాల్‌లోని ఎన్ఐహెచ్ఎస్‌డీకి పంపించారు. వాటి రిజల్ట్స్ 8న వచ్చాయి. వెంటనే ఎస్‌వోపీ ప్రకారం రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రోగం సోకిన కోళ్లను మెర్సీ కిల్లింగ్ చేపట్టాం. మరొక కోళ్ల ఫారం నుంచి 6వ తేదీన శాంపిల్స్ తీసి పంపించాం. 9వ తేదీ రాత్రి ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. 10న మళ్లీ కిల్లింగ్ ప్రొసీజర్ పూర్తి చేశాం. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టిస్తున్నాం. దాంతోపాటు అక్కడున్న వాహనాలన్నింటినీ శానిటైజ్ చేశాం” అని గుణశేఖర్ పిళ్లై వెల్లడించారు.
బర్డ్ ఫ్లూ సోకిన మండలాల్లోని పౌల్ట్రీ రైతులు ఎలాంటి బయో సెక్యూరిటీ మెజర్స్ అనుసరించాలో కూడా అవగాహన కల్పించామని ఆయన చెప్పారు.
”కోళ్ల మెర్సీ కిల్లింగ్ ప్రక్రియలో పాల్గొన్నవారిని ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయేమోనని క్వారంటైన్ చేశాం. అలాగే, బయటివారెవ్వరినీ కోళ్ల ఫారంలోకి అనుమతించవద్దని, అక్కడ పని చేసే వాళ్లను కూడా వేరే ప్రాంతాలకు పంపవద్దని ఫౌల్ట్రీ యజమానులకు సూచించాం. ఆయా ప్రాంతాల్లో మళ్లీ తాము చెప్పేవరకూ కొత్తగా కోళ్ల పెంపకం ప్రారంభించకూడదని చెప్పాం” అని గుణశేఖర్ పిళ్లై వివరించారు.
సదుం మండలంతోపాటూ అన్నమయ్య జిల్లాలోని మరో 25 మండలాల్లో తనిఖీలు చేపట్టాలని పశువైద్యులను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రస్తుతానికి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోఉన్న పౌల్ట్రీల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా కనిపించలేదని, అయినప్పటికీ తమ తనిఖీలు కొనసాగుతున్నాయని గుణశేఖర్ పిళ్లై చెప్పారు.
బర్డ్ ఫ్లూ వల్ల పౌల్ట్రీ రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అధికారులు వ్యాధి సోకిన మండలాల్లో ప్రచారం చేయిస్తున్నారు.
క్రిమిసంహారకాలను పిచికారీ చేయడం, మెర్సీ కిల్లింగ్ తర్వాత కోళ్లను జాగ్రత్తగా పాతిపెట్టడం, ఇతర ఆంక్షలను క్షేత్రస్థాయిలో ఎలా చేస్తున్నదీ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఫొటో సోర్స్, Spl
నాటు కోళ్లలోనే బర్డ్ ఫ్లూ…
బర్డ్ ఫ్లూ మరణాలన్నీ నాటు కోళ్లలో మాత్రమే కనిపిస్తున్నాయని, బ్రాయిలర్ కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలులేవని అధికారులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ బయటపడిన మూడు కోళ్ల ఫారాల్లో ఒకదానిలో 80 రోజుల వయసున్న కోళ్లు, మరో ఫారంలో ఐదు నెలలు దాటిన కోళ్లు, వేరే ఫారంలో పిల్లలు ఉన్నాయని చెబుతున్నారు. చంపి పూడ్చిపెట్టిన కోళ్లకు సంబంధించి ఎనిమిది వారాల వయసు దాటిన కోళ్లకు మాత్రమే భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని గుణశేఖర్ పిళ్లై చెప్పారు.
”ఒక ఫాంలో 1,680 కోళ్లు, మరో ఫాంలో 1,792 కోళ్లు, ఇంకొక ఫామ్‌లో 8,840 కోళ్లను పూడ్చిపెట్టాం. ఈ మూడు ఫామ్స్ లో మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాం. సదుం మండలంలో ఈ మూడు ఫారాలు మినహా ఇంకా ఎక్కడ ఇలాంటి లక్షణాలులేవు. తమిళనాడు నుంచి వాళ్లు దాణా తెచ్చారు. అయితే ఆ లారీల వల్ల కూడా ఏమైనా వచ్చిందా అనే సందేహం కూడా ఉంది” అని ఆయన వెల్లడించారు.
పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ వేసుకొని ఈ మెర్సీ కిల్లింగ్ ఆపరేషన్ పూర్తి చేశాం. కోళ్ల షెడ్డులో ఉన్న దాణాను కూడా కాల్చి వేశాం. కోళ్ల ఫారాల దగ్గరకు తీసుకువచ్చిన జేసీబీలు, ట్రాక్టర్లను కూడా శానిటైజ్ చేశాం. బర్డ్ ఫ్లూ నిర్ధరణ అయిన ప్రాంతానికి చుట్టూ కిలోమీటర్ రేడియేషన్‌లో కూడా జాగ్రత్తలు చేపడుతున్నాం. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం అని కె గుణశేఖర్ పిళ్లై చెప్పారు.
”నేను 18 వేల కోళ్లు పెంచుతున్నాను. మాకు అవి చనిపోవడం చూసి సందేహం వచ్చింది. బెంగళూరుకి తీసుకువెళ్లి పీఎం చేయించినపుడు, ఇది బర్డ్ ఫ్లూ కావచ్చు అని వారు చెప్పారు. దీంతో మేం జనవరి 20న జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాం. తర్వాత అధికారులు వచ్చి ఈనెల 4న శాంపిల్ తీసుకెళ్లారు, బర్డ్ ఫ్లూ అని 8వ తేదీన రిపోర్ట్ వచ్చింది’’ అని దుం మండలంలోని ఒక ఫౌల్ట్రీ యజమాని హేమాంబర్ రెడ్డి చెప్పారు.
”బతికున్న కోళ్లను కూడా చంపేశారు. నా 18 వేల కోళ్లలో 1800 కోళ్లే మిగిలాయి. అప్పటికే బర్డ్ ఫ్లూ పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అధికారులు మెర్సీ కిల్లింగ్ చేసినవాటికే నష్టపరిహారం ఇస్తామంటున్నారు”అని హేమాంబర్ రెడ్డి అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘అమ్మకానికి సిద్ధం చేసినప్పుడే ఇలా వచ్చింది…’
హైదరాబాద్ నుంచి ఒకరోజు వయసున్న నాటుకోడి పిల్లలను తీసుకొచ్చి, వాటికి షెడ్యూల్ ప్రకారం టీకాలు కూడా వేశామని, కానీ చికెన్ కోసం వాటిని అమ్మేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో ఇలా బర్డ్ ఫ్లూ వచ్చిందని సదుం మండలం పుట్టవారిపల్లికి చెందిన వెంకటరమణ అన్నారు.
”మేం రెండు బ్యాచ్‌ల కోళ్లు పెంచాం. ఐదు నెలల వరకు ఈ కోళ్లను పెంచుతాము. ఆ తర్వాత చికెన్ కోసం అమ్మకానికి పెడతాం. ఎక్కువగా చనిపోతుంటే అధికారులకు ఇన్ఫార్మ్ చేశాం. మేం 10,000 కోళ్లు పెంచుతుంటే ఇందులో 7,000 కోళ్లు చనిపోయాయి. తర్వాత కలెక్టర్ని కలిసి సమాచారం ఇచ్చాం. నాలుగో తేదీ వచ్చి శాంపుల్స్ తీసుకొని వెళ్లారు. తర్వాత పశుసంవర్థక శాఖ అధికారులు వచ్చి, వీటిని చంపేయాలని చెప్పారు. వాటిని గోతులు తీసి పూడ్చాం” అని ఆయన వివరించారు.
రెండు కిలోల బరువు వచ్చిన ఒక కోడిని రూ.400 నుంచి రూ.500కు అమ్ముతున్నామని, బర్డ్ ఫ్లూ వల్ల దాదాపు 10 వేల కోళ్లను పోగొట్టుకోవడంతో మొత్తం రూ.25 లక్షల పెట్టుబడిని కూడా నష్టపోయానని వెంకటరమణ చెప్పారు.
బర్డ్ ఫ్లూ కోసం మదనపల్లెలో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఏవైనా సందేహాలు ఉంటే 7013914401, 9398262752 నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రైతులకు సూచించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘బాగా ఉడికించిన చికెన్ అయితే తినొచ్చు’
మరోవైపు చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలంలోని ఓ గ్రామంలో కూడా కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమని అధికారులు నిర్ధరించారు.
ఆర్‌కేవీటీ పేట, ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, కోళ్ల శాంపిల్స్ భోపాల్ పంపించగా, బర్డ్ ఫ్లూ అని నిర్ధరణ అయిందని, దీంతో ఆ ప్రాంతంలో నివారణ చర్యలు చేపట్టామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరి బీబీసీతో చెప్పారు.
”1,875 కోళ్లు చనిపోయాయి. వాటి శాంపుల్స్ భోపాల్ పంపించాం. ఆ రిపోర్టులు మంగళవారం రాత్రే వచ్చాయి. దీంతో రెండు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను చంపి పూడ్చిపెట్టాం. వీటిలో ఇద్దరు రైతులకు సంబంధించిన ఫౌల్ట్రీ ఫారాల్లో 11 వేల కోళ్లు ఉన్నాయి” అని చెప్పారు.
ఈ నేపథ్యంలో పూర్తిగా ఉడకని కోడి మాంసం, గుడ్లు తినకూడదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వంద డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో ఉడికించిన కోడిగుడ్లు, చికెన్ తినడం సురక్షితమని సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



