Home జాతీయ national telgu అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి: రెండు రోజులుగా ఏం జరుగుతోంది? ఈ వివాదం ఎటు వెళ్తోంది

అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి: రెండు రోజులుగా ఏం జరుగుతోంది? ఈ వివాదం ఎటు వెళ్తోంది

1
0

SOURCE :- BBC NEWS

revanth reddy, allu arjun

ఫొటో సోర్స్, fb/revanthreddy/gettyimages

సంధ్య థియేటర్ ఘటన కేంద్రంగా అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి అంశం మరింత వేడెక్కింది. శనివారం అసెంబ్లీ వేదికగా మరోసారి మొదలైన చర్చ, నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ప్రకటన కొనసాగింపు ఆదివారం కూడా జరిగింది.

అటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఇటు పోలీసులు వరుసగా అల్లు అర్జున్ అంశంపై ఘాటుగా మాట్లాడారు.

సంధ్య థియేటర్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు మరోసారి మీడియా ముందు విపులంగా మాట్లాడారు. ఏడాది చివర్లో పోలీసులు నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్సులో భాగంగా కమిషనర్ సీవీ ఆనంద్, చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్‌లు ఆదివారం మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తెలంగాణ డీజీపీ జితేందర్, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం నాయకులు విష్ణుమూర్తి కూడా ఈ అంశంపై వేర్వేరు వేదికలపై మాట్లాడారు.

”తాము అల్లు అర్జున్‌కి వ్యతిరేకం కాదనీ, అదే సందర్భంలో పౌరుల రక్షణ ముఖ్యం” అని డీజీపీ అన్నారు. భద్రత కంటే ప్రమోషన్ ముఖ్యం కాదని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అల్లు అర్జున్‌ దగ్గరికి వెళ్లనివ్వలేదు: ఏసీపీ రమేశ్

”అల్లు అర్జున్ మేనేజర్‌కి ముందుగా విషయం వివరించాం. మహిళ చనిపోయిందని చెప్పాం. కానీ మేనేజర్ మమ్మల్ని అర్జున్ దగ్గరకు వెళ్లనివ్వలేదు. తరువాత మేమే నెట్టుకుంటూ అర్జున్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి వెళ్లిపోవాలని సూచించాం. కానీ సినిమా చూశాకే వెళ్తానని ఆయన అన్నారు. మేం వెంటనే డీసీపీకి చెప్పాం. డీసీపీ మేమూ ఆయన దగ్గరకు వెళ్లి అప్పుడు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకుని వచ్చాం” అని ఏసీపీ రమేశ్ కుమార్ మీడియాతో చెప్పారు.

ఇక అదే ప్రెస్‌మీట్లో స్థానిక సీఐ కూడా మాట్లాడారు. తమను అర్జున్ దగ్గరకు పంపేందుకు థియేటర్ మేనేజర్ ఒప్పుకోలేదని ఆయన ఆరోపించారు. ఘటన తన కళ్లతో చూశాననీ, ఎంతో బాధాకరమనీ అన్నారు. ఆరోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ ఘటనపై విచారణ ఇంకా జరుగుతోందని కమిషనర్ ఆనంద్ చెప్పారు

చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/Chamala Kiran Kumar

పశ్చాత్తాపం ప్రకటించలేదు: కాంగ్రెస్

అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అల్లు అర్జున్‌పై దాడి పెంచారు. కొందరు కాంగ్రెస్ నాయకులు అర్జున్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆది శ్రీనివాస్, చామల కిరణ్ కుమార్, బల్మూరి వెంకట్‌లు అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు.

”సీఎం రేవంత్ మాటలను తప్పుబట్టేలా అల్లు అర్జున్ మాట్లాడుతున్నారనీ, ఆయనలో కనీస పశ్చాత్తాపం లేదు” అని ఆది శ్రీనివాస్ అన్నారు.

అల్లు అర్జున్ తన మాటలు వెనక్కు తీసుకోవాల ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.

”అర్జున్ సినిమా హాల్లో ఎంతసేపు ఉన్నారనేది ఫుటేజ్ ఉంది. ఘటనపై పశ్చాత్తాపం ప్రకటించలేదు. రేవతి చనిపోయిన మరునాడు ఇంటి దగ్గర టపాసులు కాల్చుకున్నారు. అసలు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అతను ఆత్మపరిశీలన చేసుకోవాలి” అన్నారు వెంకట్.

”అసలు అల్లు అర్జున్‌ మానవత్వం అనేది మర్చిపోయినట్టు ఉన్నారు. ఎవరో రాసిచ్చింది చదువుతూ నిజ జీవితంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఆయన బాధ్యతగా వ్యవహరించాలి. మేం పుష్ప సినిమాకు సహకరించాం” అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంపై కొందరు దాడికి దిగారు. ఓయూ విద్యార్థి సంఘాల వారిగా చెబుతోన్న కొందరు యువత, ఆయన ఇంటికి వెళ్లి ఆవరణలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటిపైకి రాళ్లు విసిరారు.

రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినదించి, ఆ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని బందోబస్తు కల్పించారు.

దాడిని ఖండిస్తున్నా: సీఎం రేవంత్

”సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి” అని తెలిపారు.

బండి సంజయ్

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook

సినీ పరిశ్రమపై పగ: బీజేపీ

మరోవైపు ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని బీజేపీ తప్పు పడుతోంది.

”పౌరుల భద్రతను పరిరక్షించడంలో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని ఇటువంటి సంఘటనలు ఎత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కళాకారులు, చిత్ర పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవడం ధోరణిగా మారింది. ఈ చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా స్పాన్సర్ చేస్తుందా? ” అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమపై పగబట్టినట్టు కనిపిస్తోందని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

”గురుకుల విద్యార్థులు చనిపోతే సీఎం పరామర్శించలేదు. వారికో న్యాయం మీకో న్యాయమా? పనిగట్టుకుని అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసి, అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడారు. ఎంఐఎం సభ్యునితో కావాలని సీఎం ప్రశ్న అడిగించారు” అని అన్నారు బండి సంజయ్.

పబ్లిక్‌గా తిరగగలవా?: ఏసీపీ విష్ణుమూర్తి

ఇక తెలంగాణ పోలీసు అధికారుల సంఘం నాయకులు, సస్పెన్షన్‌లో ఉన్న అధికారి విష్ణుమూర్తి అల్లు అర్జున్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు.

”మీరు సక్సెస్ మీట్లు పెట్టుకోలేదని బాధపడుతున్నారు. నీ రీల్స్ అన్నీ కట్ చేయగలం. మేం తలచుకుంటే పబ్లిక్‌గా తిరగగలవా? నీకు బాధ్యత లేదా. పోలీసుల మీద ఆరోపణలు చేయకు. మా జోలికి వస్తే మాత్రం కట్ అయితయ్” అన్నారు విష్ణుమూర్తి.

తన ఫ్యాన్స్ ముసుగులో కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తప్పుబట్టారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామనీ, బాధ్యతయుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొందరు అల్లు అర్జున్ అభిమానులుగా చెప్పుకుంటున్న వారు ఆన్‌లైన్‌లో తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.

లక్ష్యంగా చేసుకున్నారు: దుర్గం రవీందర్

శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఖచ్చితంగా ఒక ఇంటెన్షన్‌తో అల్లు అర్జున్‌ను లక్ష్యం చేసుకుని మాట్లాడారనేది స్పష్టమవుతోందని సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్ బీబీసీతో అన్నారు.

”ఏ సమస్యా లేదన్నట్టు సభలో ఎమ్మెల్యే అక్బర్ అడగడం, వెంటనే రేవంత్ సుదీర్ఘ వివరణ ఇవ్వడం చూస్తే ఇదే అనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు విషయంలో రేవంత్‌కి తెలుగుదేశం అభిమానులు బాగా మద్దతిస్తున్నారు. అంటే ఇక్కడ క్యాస్ట్, క్యాష్ అంశాలు కూడా పరోక్షంగా పనిచేస్తున్నాయని అనిపిస్తోంది. లేకపోతే కేసులో ఏ11 మీద ఉండే చర్యల తీవ్రత ఇంత ఎక్కువగా అయితే ఉండదు” అని రవీందర్ అన్నారు .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)