Home జాతీయ national telgu అలీ రజా ఆరాఫీ: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ ఈయనేనా? ఎవరీ ఆరాఫీ?

అలీ రజా ఆరాఫీ: ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ ఈయనేనా? ఎవరీ ఆరాఫీ?

29
0

SOURCE :- BBC NEWS

అలీ రజా ఆరాఫీ, ఇరాన్, సుప్రీం లీడర్

ఫొటో సోర్స్, SHAFEQNA

ఇజ్రాయెల్, అమెరికా దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి(ఇంటెరిమ్ లీడర్‌షిప్ కౌన్సిల్) ఏర్పడింది.

ఈ త్రిసభ్య మండలిలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఘోలం-హుస్సేన్ మొహ్సని-ఎజాయ్, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు అలీ రజా ఆరాఫీ ఉన్నారు.

గార్డియన్ కౌన్సిల్ సభ్యుడైన అలీ రజా ఆరాఫీ తాత్కాలిక నాయకత్వ మండలిలో జ్యూరిస్ట్‌గా ఎంపికయ్యారు.

ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం, సుప్రీం లీడర్ మరణిస్తే, రాజీనామా చేస్తే లేదా పదవీచ్యుతులైనా తాత్కాలిక నాయకత్వ మండలి ఏర్పడుతుంది.

ఇందులో అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ చీఫ్‌, గార్డియన్ కౌన్సిల్ సభ్యులలో ఒకరు ఉంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఈ కౌన్సిల్ ఏం చేస్తుంది?

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు, ఈ మండలి దేశాన్ని పాలిస్తుంది. అయితే, ఈ త్రిసభ్య మండలికి పూర్తి అధికారాలు ఉండవు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సుప్రీం లీడర్ సలహా మండలిలోని మూడొంతుల సభ్యుల ఆమోదం ఉండాలి.

  • సాధారణ విధాన నిర్ణయాలు
  • ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన
  • యుద్ధం లేదా శాంతి ప్రకటన
  • అధ్యక్షుడిపై అభిశంసన
  • జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ లేదా సీనియర్ సైనిక, పోలీసు అధికారుల నియామకం లేదా తొలగింపు.
ఖమేనీ సమావేశం, ఇరాన్

ఫొటో సోర్స్, LEADER.IR

ఎవరీ అలీ రజా ఆరాఫీ?

ఇరానియన్ మీడియా ప్రకారం, అలీ రజా ఆరాఫీ 1959లో యజ్ద్ ప్రావిన్స్‌లోని మెబద్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి మొహమ్మద్ ఇబ్రహీం ఆరాఫీ, ఒక మతగురువు. పహ్లావి పాలనను మొహమ్మద్ ఇబ్రహీం వ్యతిరేకించారు, అయతొల్లా ఖొమేనీకి దగ్గరగా ఉన్న మత నాయకులతో ఆయనకు సంబంధాలున్నాయి. అలీ రజా ఆరాఫీ తల్లి పేరు షేక్ కాజిమ్ మాలిక్, ఆమె అఫ్జల్ అర్దకానీ కుమార్తె.

అలీ రజా ఆరాఫీ చిన్నతనంలో తన తండ్రి, ఇతర ఉపాధ్యాయుల నుంచి ప్రారంభ మత విద్యనభ్యసించారు. ప్రాథమిక విద్య కోసం కోమ్‌కు వెళ్లారు అలీ రజా ఆరాఫీ, ఆపై మదర్సాలో చదువుకున్నారు.

మోర్తేజా హెరీ యజ్దీ, మొహమ్మద్ ఫజల్ లంకరానీ, హుసేన్ వాహిద్ ఖొరాసానీ, జవాద్ తబ్రీజీ, హసన్ హసన్జాదే అమోలీ వంటి షియా మత పండితుల వద్ద చదువుకున్నారాయన. మొహమ్మద్ తకీ మిస్బా యజ్దీ వద్ద ఫిలాసఫీ నేర్చుకున్నారు అలీ రజా ఆరాఫీ.

ఆరాఫీకి మదర్సాలు, విశ్వవిద్యాలయాలలో బోధనానుభవం ఉంది. అనేక పరిశోధన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారు.

ఆరాఫీ చిన్నప్పటి నుంచీ రాజకీయంగా చురుగ్గా ఉన్నారు, పహ్లావి పాలనకు వ్యతిరేకంగా తన తండ్రితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. 16 ఏళ్ల వయసులో అరెస్టై, కొంతకాలం జైలు పాలయ్యారు.

1979లో, “కౌన్సిల్ ఫర్ సూపర్‌విజన్ ఆఫ్ నాన్ ఇరానియన్ స్టూడెంట్స్” అనే సంస్థను కుమ్‌లోని సెమినరీలో స్థాపించారు. 1986లో సంస్థ నిర్మాణంలో మార్పులు, దాని కార్యకలాపాల విస్తరణ తర్వాత, దానిని “వరల్డ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ సైన్సెస్”గా పేరు మార్చారు.

ఈ సంస్థ 1993లో ఇరాన్ సుప్రీం లీడర్ పర్యవేక్షణలోకి వచ్చింది. 2002లో ఆరాఫీకి సంస్థ నాయకత్వాన్ని అప్పగించారు ఖమేనీ. ఆరాఫీ 2008 వరకు దాని హెడ్‌గా కొనసాగారు.

ఆరాఫీ “యూనివర్సిటీ ఆఫ్ హోలీ ఖురాన్ సైన్సెస్ అండ్ ఎడ్యుకేషన్” ట్రస్టీల బోర్డు సభ్యుడు కూడా.

ఆయన మెబద్ ఇమామ్-ఎ-జుమే (శుక్రవారం ప్రార్థన నాయకుడు), 2014లో కుమ్ ఇమామ్-ఎ-జుమేగా కూడా ఉన్నారు.

అంతేకాదు, సాంస్కృతిక విప్లవ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు. 2016లో కుమ్ సెమినరీ డైరెక్టర్‌గా, ఇరాన్ సెమినరీల హడ్‌గా నియమితులయ్యారు ఆరాఫీ. ఆయన కుమ్ మదర్సా ఉపాధ్యాయ సంఘం సభ్యుడు కూడా.

ఖమేనీ ఆదేశాల మేరకు ఆరాఫీ 2019లో గార్డియన్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఖమేనీకి నమ్మకమైన వ్యక్తి

కొన్నేళ్ల కిందటి వరకు అలీ రజా ఆరాఫీ అంతగా తెలియని పేరు. ఆయనను గతంలో “హుజ్జత్ అల్-ఇస్లాం” అని పిలిచేవారు. కానీ, ఇప్పుడు “అయతొల్లా” అని పిలుస్తున్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి ఆరాఫీపై పూర్తి నమ్మకం ఉండేది. ఆయనను తన సన్నిహితులలో ఒకరిగా పరిగణించేవారు.

ఈ నమ్మకం, సాన్నిహిత్యం క్రమంగా ఆరాఫీ ప్రాముఖ్యతను పెంచింది. ఖమేనీ తర్వాత కాబోయే సుప్రీం లీడర్ అభ్యర్థులలో ఆయన పేరు కూడా చేరింది. ఆరాఫీ తన ప్రసంగాలలో తరచుగా ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడి అభిప్రాయాలను ప్రతిధ్వనించేవారు.

‘పాశ్చాత్య ఆలోచన’ను ఎదుర్కోగలిగిన.. సంభాషణ, నిరసన, జిహాద్, విప్లవం వంటి సూత్రాల ఆధారాతి ఆలోచనా విధాన ఆవశ్యకతను ఆరాఫీ బలంగా వాదించారు. విదేశాంగ విధానం, దేశీయ సమస్యలపై ఆయన అభిప్రాయాలు కూడా సుప్రీం లీడర్ విధానాలకు అనుగుణంగా ఉన్నాయి.

అమెరికా వైఖరి, జనాభా పెరుగుదల విధానాలపై ఆరాఫీ ప్రతిస్పందిస్తూ, ఇరాన్ రక్షణ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు.

2017 జులైలో, కుమ్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఆరాఫీ అమెరికాను, “ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు కేంద్రబిందువు”గా అభివర్ణించారు.

ఇటీవలి సంవత్సరాలలో ఇస్లామిక్ రిపబ్లిక్ మతపరమైన, రాజకీయ నిర్మాణంలో ఆరాఫీ ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగిననట్లు ఆయన ఎదుగుదల స్పష్టంగా చూపుతోంది.

తాత్కాలిక నాయకత్వ మండలిలో ఆరాఫీకి కేటాయించిన బాధ్యతను బట్టి, ఇరాన్‌లో తదుపరి ఏం జరిగినా ఆయన ముఖ్యమైన పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)