Home LATEST NEWS telugu తాజా వార్తలు అమెరికా Vs ఇరాన్: యుద్ధమేఘాల నడుమ చర్చలకు సిద్ధమవుతున్న ఇరుదేశాలు.. డీల్ కుదిరేనా?

అమెరికా Vs ఇరాన్: యుద్ధమేఘాల నడుమ చర్చలకు సిద్ధమవుతున్న ఇరుదేశాలు.. డీల్ కుదిరేనా?

3
0

SOURCE :- BBC NEWS

అమెరికా, ఇరాన్, యుద్ధం, చర్చలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ, ఇరుదేశాల ఉన్నతాధికారులు చర్చల కోసం త్వరలోనే ఒమన్‌లో భేటీ కానున్నారు.

గత నెలలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఇరాన్‌ ప్రభుత్వం కఠినంగా అణచివేయడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా బలగాలను మోహరించింది. అణచివేత కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

దీంతో ప్రత్యక్ష యుద్ధ భయాలు కొనసాగుతుండడంతో, ఇరుదేశాల మధ్య చర్చల అంశం తెరపైకి వచ్చింది.

అయితే, అంతకుముందు ఈ చర్చలు ఎక్కడ జరగాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే విషయంలో నెలకొన్న అనిశ్చితి ఈ చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించేలా కనిపించింది.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పొరుగు దేశాల దౌత్యప్రయత్నాలతో చర్చలకు మార్గం సుగమమైంది.

కానీ, ఇరుదేశాల అభిప్రాయాల మధ్య భారీ అగాథం కనిపిస్తోంది. ఒకవేళ ఈ చర్చలు విజయవంతమైతే, తదుపరి జరిగే చర్చల కార్యాచరణను సిద్ధం చేయడానికి తోడ్పడతాయని విశ్లేషకులు ఆశిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

మరోవైపు, ఇరాన్‌ నుంచి తక్షణమే వచ్చేయాలని తమ పౌరులకు ఇరాన్‌లోని అమెరికన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. రోడ్లు మూసివేయడం, ప్రజా రవాణా పనిచేయకపోవడం, విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేయడం లేదా తగ్గించేయడం చేయవచ్చని.. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

అవసరమైతే రోడ్డుమార్గంలో అర్మేనియా లేదా తుర్కియే వెళ్లిపోయే అవకాశాలను పరిశీలించాలని కోరింది.

అమెరికా, ఇరాన్, యుద్ధం, చర్చలు

ఫొటో సోర్స్, Handout via Reuters

చర్చలు కొలిక్కివచ్చేనా?

ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపేయాలని, తనవద్దనున్న శుద్ధిచేసిన యురేనియం నిల్వలను నాశనం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

అలాగే.. బాలిస్టిక్ క్షిపణులు, ప్రాంతీయ సాయుధ గ్రూపులకు అందిస్తున్న మద్దతు, దేశీయంగా మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో భాగంగా ఉండాలని అమెరికా అంటోంది.

ఇరాన్ మాత్రం ఈ చర్చలు కేవలం అణుకార్యక్రమానికే పరిమితం చేయాలని చెబుతోంది.

ఇలా భిన్నాభిప్రాయాలున్న అంశాలపై చర్చలు కొలిక్కివస్తాయా? లేదా? అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.

ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే బాంబుదాడి చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు.

అంతేకాదు, వేలాది అమెరికా సైనిక బలగాలను, ట్రంప్ ‘ఆర్మాడా’గా అభివర్ణించిన భారీ యుద్ధ నౌకలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించారు. వీటిలో విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.

అమెరికా దాడికి పాల్పడితే తగిన రీతిలో బదులు ఉంటుందని ఇరాన్ ప్రతిస్పందించింది. మిడిల్ ఈస్ట్‌తో పాటు ఇజ్రాయెల్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు తప్పవని స్పష్టం చేసింది.

తమ సాయుధ దళాలు ట్రిగ్గర్‌పై వేలుపెట్టి సిద్ధంగా ఉన్నాయని గతవారం మాట్లాడిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇప్పుడీ చర్చల్లో ఇరాన్ బృందానికి నాయకత్వం వహించనున్నారు.

మరోవైపు, అమెరికా తరఫున ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ ప్రాతినిధ్యం వహించనున్నారు.

అమెరికా, ఇరాన్, యుద్ధం, చర్చలు

తీవ్ర ఉద్రిక్తతల తర్వాత తొలిసారి చర్చలు…

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నిరుడు జూన్‌లో జరిగిన యుద్ధం తర్వాత అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య తొలిసారి చర్చలు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఇరాన్‌లోని మూడు ప్రధాన అణుకేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేసింది.

ఈ దాడుల తర్వాత తమ యురేనియం శుద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినట్లు ఇరాన్ చెబుతోంది.

ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత చూస్తే, ఇప్పుడు దేశ పాలనా యంత్రాంగం అత్యంత బలహీన స్థితిలో ఉందని, ఒకవేళ అమెరికా దాడి చేస్తే అది మరింత అస్థిరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా సైనిక చర్యను నివారించడానికి సంక్షోభంలో ఉన్న ఇరాన్ నాయకులకు ఈ చర్చలే చివరి అవకాశం కావొచ్చని అంటున్నారు.

అమెరికా దాడుల తర్వాత ఫోర్డో అణుస్థావరం శాటిలైట్ చిత్రం

ఫొటో సోర్స్, Reuters

ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న కారణంగా ఇరాన్‌లో పెద్దయెత్తున జరిగిన నిరసనలను ప్రభుత్వం క్రూరంగా అణచివేయడంతో నిరసకారులు ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన అంతానికి పిలుపునిచ్చారు, అదే సమయంలో డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్‌లో ఇప్పటివరకూ కనీసం 6,883 మంది మరణించినట్లు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్‌ఆర్ఏఎన్ఏ) పేర్కొంది. అయితే, నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా పేర్కొంది.

అరెస్ట్ అయిన నిరసనకారుల సంఖ్య కూడా 50 వేల కంటే ఎక్కువగానే ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.

ఇరాన్ అణు కార్యక్రమ అంశం కూడా ప్రస్తుత సంక్షోభంతో మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

పాశ్చాత్య దేశాలతో ఇరాన్‌కు సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాలకు ఈ అణు కార్యక్రమమే ప్రధాన కేంద్ర బిందువుగా ఉంది.

ఈ అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాలకు మాత్రమేని దశాబ్దాలుగా ఇరాన్ చెబుతోంది.

కానీ, అది అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగమేనని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నాయి.

ఇరాన్ మాత్రం యురేనియం శుద్ధిచేసే హక్కు తమకు ఉందని అంటోంది. అంతేకాదు, తమ వద్దనున్న 400 కిలోల (880 పౌండ్ల) అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మరో దేశానికి తరలించాలనే డిమాండ్లను కూడా తిరస్కరించింది.

అమెరికా, ఇరాన్, యుద్ధం, చర్చలు

ఫొటో సోర్స్, EPA

ఒమన్‌లో చర్చలు..

తమ డిమాండ్లలో కొన్ని మినహాయింపులకు ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

యురేనియం శుద్ధి కోసం ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా అందులో ఒకటి.

బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని పరిమితం చేయాలని, అనుబంధ గ్రూపులకు మద్దతు నిలిపేయాలన్న డిమాండ్లను మాత్రం ఇరాన్ తోసిపుచ్చింది.

గాజాలోని హమాస్, ఇరాక్‌లోని మిలీషియాలు, లెబనాన్‌లోని హిజ్బొల్లా, యెమెన్‌లోని హూతీలతో కూడిన కూటమిని ‘రెసిస్టెన్స్ యాక్సిస్’ అని ఇరాన్ పిలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, తమ ఆర్థిక వ్యవస్థను కుదేలుచేసే ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది.

ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు మాత్రం, ఆ దేశానికి ఎలాంటి మినహాయింపులు ఇచ్చినా అది అక్కడి మతగురువుల పాలనకు తిరిగి ఊపిరిపోసినట్లే అవుతుందని వాదిస్తున్నారు.

అమెరికా విషయానికొస్తే, ఈ చర్చల ఫలితాలను బట్టి డోనల్డ్ ట్రంప్‌కు తాను చేసిన సైనిక హెచ్చరికల నుంచి వెనక్కి తగ్గడానికి ఒక అవకాశం లభించవచ్చు.

ఒకవేళ అమెరికా గనుక దాడి చేస్తే, అది భారీ యుద్ధానికి లేదా ఇరాన్‌లో దీర్ఘకాలిక అరాచకానికి దారితీయవచ్చని పొరుగు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉద్రిక్తతలను తగ్గించే ఉద్దేశంతో ఈజిప్ట్, తుర్కియే ఖతార్ చేస్తున్న ప్రయత్నాలతో తొలుత ఇస్తాంబుల్‌లో చర్చలు నిర్వహించాలనుకున్నారు.

అయితే, చివరి నిమిషంలో ఈ సమావేశ వేదికను ఒమన్‌కు మార్చాలని ఇరాన్ కోరింది. గత ఏడాది కూడా అక్కడే చర్చలు జరిగాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS