SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిరుడు ప్రపంచవ్యాప్తంగా విధించిన భారీ దిగుమతి సుంకాల విషయంలో ఆయన తన అధికార పరిధిని అతిక్రమించారని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టు 6-3 మెజారిటీ ఇచ్చిన తీర్పులో ”ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పన్నులు విధించడానికి ట్రంప్ 1977 నాటి చట్టం (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్-ఐఈఈపీఏ)ను ఉపయోగించలేరు” అని స్పష్టం చేసింది.
ఈ తీర్పు వల్ల ఒక కీలక పరిణామానికి అవకాశం ఏర్పడింది.
ఇప్పటివరకు ఈ సుంకాల రూపేణా వసూలు చేసిన సుమారు 130 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.11 లక్షల కోట్లు) మొత్తాన్ని వినియోగదారులకు, వ్యాపారులకు తిరిగి చెల్లించాల్సి రావచ్చు. అయితే, ఈ రీఫండ్‌ల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం వెల్లడించలేదు. కాబట్టి ఇది రానున్న రోజుల్లో మరో పెద్ద న్యాయ పోరాటానికి దారితీసే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే, ట్రంప్ మరో ప్రత్యామ్నాయ చట్టాన్ని ఉపయోగించి కొత్త ప్రకటనపై సంతకం చేశారు. 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122ను ఉపయోగించి, అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం తాత్కాలిక సుంకాన్ని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కానీ తరువాత ఈ సుంకాలను 15 శాతానికి పెంచుతున్నట్టు వెల్లడించారు. అయితే 10 శాతం సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించిన రోజు నుంచే 15 శాతానికి పెంచిన ఈ సుంకాలు కూడా అమల్లోకి వస్తాయా అనే విషయంపై స్పష్టత లేదు.
సుప్రీం కోర్టు తీర్పు, ఆ వెనువెంటనే ట్రంప్ కొత్తగా 10 శాతం సుంకాలు, తదుపరి 15 శాతానికి పెంచుతూ ప్రకటన చేసిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే సందేహాలకు తగిన స్పష్టత రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఏ సుంకాలు చట్టవిరుద్ధం, ఎందుకు?
ఫిబ్రవరి 20న తీర్పు ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు, ట్రంప్ ఐఈఈపీఏ కింద విధించిన సుంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధ్యక్షుడికి ఇస్తుంది.
ట్రంప్ ఈ చట్టాన్ని తొలిసారిగా నిరుడు ఫిబ్రవరిలో చైనా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు విధింపునకు ఉపయోగించారు. ఆ దేశాల నుంచి సాగుతున్న ‘ఫెంటానిల్’ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అమెరికాలో ఒక ‘అత్యవసర పరిస్థితి’గా మారిందని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు.
కొన్ని నెలల తర్వాత, ‘లిబరేషన్ డే’ అని అభివర్ణిస్తూ ట్రంప్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం నుంచి 50 శాతం వరకు భారీగా సుంకాలు విధించారు. అమెరికా వాణిజ్య లోటు ఒక ‘అసాధారణమైన ముప్పు’గా పరిణమించిందని ఆయన ఈ సందర్భంగా వాదించారు.
అయితే, కొత్త పన్నులను సృష్టించే అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఐఈఈపీఏ కింద వాణిజ్యాన్ని నియంత్రించవచ్చు కానీ, దానిని ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే మార్గంగా వాడకూడదని కోర్టు పేర్కొంది.
అయినప్పటికీ, గత ఏడాది కాలంలో ట్రంప్ విధించిన కొన్ని సుంకాలు ఐఈఈపీఏ పరిధిలోకి రావు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అవి అమలులోనే ఉండవచ్చు. వాటిలో స్టీల్, అల్యూమినియం, కలప, ఆటోమొబైల్స్ పై విధించిన సుంకాలు ఉన్నాయి.
వీటిని ట్రంప్ 1962 నాటి ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్‌లోని ‘సెక్షన్ 232’ కింద ‘జాతీయ భద్రత’ కారణాలను చూపుతూ విధించారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
కొత్తగా తాత్కాలిక సుంకాలు…
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, ట్రంప్ ఇంతవరకు ఎప్పుడూ ఉపయోగించని ‘సెక్షన్ 122’ను తెరపైకి తెచ్చారు. అమెరికాకు వచ్చే దాదాపు అన్ని దిగుమతులపై 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ సెక్షన్ ప్రకారం అధ్యక్షుడికి గరిష్ఠంగా 15 శాతం వరకూ సుంకాలను విధించే అధికారం ఉంటుంది. అయితే ఇది కేవలం 150 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఆ తర్వాత అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అంటే ఈ పరిష్కారం కేవలం తాత్కాలికమే.
అయితే, ట్రంప్ ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సుంకాలను కొనసాగించే అవకాశం ఉంది. 150 రోజుల తర్వాత ఈ సుంకాలను ముగించి, వెంటనే మరొక కొత్త ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించడం ద్వారా వాటిని మళ్లీ అమలు చేయవచ్చని కాటో ఇన్‌స్టిట్యూట్ అనే థింక్ ట్యాక్ సంస్థ చెబుతోంది.
అంతర్జాతీయ చెల్లింపుల్లోని ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి, అమెరికా వాణిజ్యాన్ని సమతుల్యం చేయడానికి ఈ ‘సెక్షన్ 122’ను ఉపయోగిస్తున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
అదే సమయంలో 1974 నాటి ట్రేడ్ యాక్ట్‌లోని ‘సెక్షన్ 301’ కింద కూడా సుంకాలు విధించడానికి అవకాశం ఉందా అనే కోణంలోనూ ట్రంప్ ఆరా తీస్తున్నారు.
ఈ చట్టం ప్రస్తుతం జేమీసన్ గ్రీర్ నేతృత్వంలోని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) కార్యాలయానికి ఇతర దేశాల వాణిజ్య పద్ధతులపై విచారణ జరిపే అధికారాన్ని ఇస్తుంది. ఒకవేళ ఏదైనా దేశం వాణిజ్య విధానాలు ‘వివక్షపూరితంగా’ లేదా ‘అన్యాయంగా’ ఉన్నాయని తేలితే, వాటిపై యూఎస్‌టీఆర్ సుంకాలను విధించవచ్చు.
అలాగే, ట్రంప్ తన తొలిదఫా పదవీకాలంలో విరివిగా ఉపయోగించిన 1962 నాటి ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్‌లోని సెక్షన్ 232 కింద కూడా ఇప్పుడు సుంకాలను విధించడం కొనసాగించవచ్చు.
జాతీయ భద్రతకు ముప్పు కలిగించే దిగుమతులపై పన్నులు విధించడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అయితే, వీటిని విధించే ముందు తప్పనిసరిగా విచారణ జరపాలి, కాబట్టి వీటి అమలుకు కొంత సమయం పడుతుంది.
ఆర్థికవేత్త ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ఒకసారి దర్యాప్తు పూర్తి చేసి ఈ సుంకాలను అమల్లోకి తెస్తే, వాటిని సవాలు చేయడం లేదా తొలగించడం చాలా కష్టమని చెప్పారు. ఎందుకంటే ఇవి అధికారిక నివేదికలు, పరిశోధనల ఆధారంగా విధిస్తారు.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక కీలక ప్రకటన చేశారు.
‘సెక్షన్ 122’ సుంకాలను, మరింత పటిష్టమైన ‘సెక్షన్ 232’, ‘సెక్షన్ 301’ సుంకాలను కలపడం ద్వారా, 2026లో సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండదని ఆయన చెప్పారు.
అంటే, సుప్రీంకోర్టు కొట్టివేసిన ఐఈఈపీఏ సుంకాల వల్ల కలిగే ఆదాయ నష్టాన్ని ఈ కొత్త సుంకాలు భర్తీ చేస్తాయని ఆయన ఉద్దేశం.
ఫొటో సోర్స్, Getty Images
చట్టవిరుద్ధ సుంకాల నుంచి రీఫండ్ వస్తుందా?
సుంకాలు విధించడానికి ట్రంప్ చెప్పిన ప్రధాన కారణాలలో ఒకటి: ‘సుంకాల ద్వారా వచ్చే డబ్బు అమెరికా ఖజానాకు చేరుతుంది, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.’
వివిధ నివేదికల ప్రకారం, విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునే కంపెనీల నుంచి అమెరికా ప్రభుత్వం బిలియన్ల కొద్దీ డాలర్లను వసూలు చేసింది. అంచనాల ప్రకారం ఈ మొత్తం సుమారు 130 బిలియన్ల డాలర్లు (దాదాపు రూ.11 లక్షల కోట్లు).
ట్రంప్ విధించిన ఐఈఈపీఏ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, ఆ పన్నులు చెల్లించిన వారికి డబ్బును ఎలా తిరిగి ఇవ్వాలనే (రీఫండ్) విషయంలో ఎటువంటి మార్గదర్శకాలను నిర్దేశించలేదు.
ఈ రీఫండ్‌ల గురించి రిపోర్టర్ల ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, ఒకవేళ ఈ రీఫండ్‌లు ఇవ్వాల్సి వచ్చినా, అవి చాలా ఏళ్ల పాటు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుపోయే అవకాశం ఉందని చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ట్రెజరీ సెక్రటరీ బెస్సెంట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బెస్సెంట్ మాట్లాడుతూ.. ఐఈఈపీఏ సుంకాల ద్వారా అప్పటికే వసూలుచేసిన ఆదాయం ప్రస్తుతం ‘వివాదం’లో ఉందని, సుప్రీంకోర్టు ఈ రీఫండ్‌లపై ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.
ఈ రీఫండ్‌ల వ్యవహారాన్ని ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు తేల్చాల్సి ఉంటుంది.
రీఫండ్‌లు కూడా ఎక్కువగా పెద్ద కంపెనీలకే దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే, చిన్న వ్యాపారాలకు రీఫండ్ కోసం అవసరమైన సుదీర్ఘ, చట్టపరమైన ప్రక్రియలను కొనసాగించే స్తోమత ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
లిబరల్ థింక్ ట్యాంక్ ‘గ్రౌండ్‌వర్క్ కలెక్టివ్’ అనే సంస్థలో పాలసీ అండ్ అడ్వకసీ చీఫ్ అలెక్స్ జాక్వెజ్ బీబీసీ మీడియా భాగస్వామి సీబీఎస్‌తో మాట్లాడుతూ, కోర్టు తీర్పు వెలువడక ముందే వెయ్యికి పైగా వ్యాపార సంస్థలు రీఫండ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు.
ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
చట్టవిరుద్ధమైన సుంకాల వల్ల అమెరికాలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 1,700 డాలర్లు (సుమారు రూ.1.4 లక్షలు) చొప్పున రీఫండ్ చెక్‌ను ప్రభుత్వం జారీ చేయాలని ఇల్లినాయిస్ డెమోక్రాటిక్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్ డిమాండ్ చేశారు.
“టారిఫ్ రిబేట్ చెక్” ఇస్తానని గతంలో ట్రంప్ కూడా చాలా సందర్భాలలో అమెరికన్లకు హామీ ఇచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



