SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
3 గంటలు క్రితం
ఒకవేళ తమపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికాతో జరిగే చర్చలను త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం తెలిపారు.
ఒకవేళ అమెరికా దాడికి దిగితే, ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
”వాషింగ్టన్ మాపై దాడి చేస్తే, మేం అమెరికా భూభాగంపై దాడి చేయం కానీ, ఈ ప్రాంతంలోని (పశ్చిమాసియాలోని) వారి సైనిక స్థావరాలపై దాడి చేస్తాం” అని అబ్బాస్ చెప్పారు.
ట్రంప్ ఒకప్పటి ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లు అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (యుద్ధ నౌక) అబ్రహం లింకన్‌ను సందర్శించిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది.

వాస్తవానికి శుక్రవారమే ఉన్నత స్థాయిలో అమెరికా-ఇరాన్ మధ్య ఒమన్‌లో చర్చలు జరిగాయి. తదుపరి సమావేశం కోసం తేదీని ఇంకా నిర్ణయించలేదని అబ్బాస్ చెప్పారు. కానీ, త్వరలోనే ఈ సమావేశాన్ని నిర్ణయించేందుకు రెండు పక్షాలు అంగీకరించాయని తెలిపారు.
”వచ్చే వారం మేం మరోసారి కలుస్తాం” అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం (ఫిబ్రవరి 7న) చెప్పారు.
శుక్రవారం ఒమన్‌లో చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే, ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై (కార్యనిర్వాహక ఉత్తర్వుపై) డోనల్డ్ ట్రంప్ సంతకం పెట్టారు.
అయితే, ఈ సుంకాలు ఎంతనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే, 25 శాతం వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, EPA
‘యురేనియం శుద్ధిచేయడం ఇరాన్ హక్కు’
శుక్రవారం చర్చలు పరోక్షంగా జరిగాయని, కేవలం అణు సమస్యకే పరిమితమయ్యాయని అబ్బాస్ అరాగ్చీ చెప్పారు.
”ఇరాన్ పరంగా చూసుకుంటే, యురేనియం శుద్ధిని నిలిపివేయాలనే విషయంపై ఎలాంటి చర్చలు ఉండవు. యురేనియం శుద్ధి చేయడం ఇరాన్ హక్కు. అవి తప్పనిసరిగా కొనసాగుతాయి” అని అబ్బాస్ స్పష్టం చేశారు.
”బాంబులు వేయడం ద్వారా వారు (అమెరికా) ఈ ప్రాంతంలో ఇరాన్ సామర్థ్యాలను ధ్వంసం చేయలేరు” అని చెప్పారు.
అయితే, ఈ విషయంపై అమెరికాతో ‘భరోసా కల్పించే’ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అబ్బాస్ హామీ ఇచ్చారు.
ఇరాన్ క్షిపణి కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. ”క్షిపణుల విషయంలో ఇప్పుడు కానీ, భవిష్యత్‌లో కానీ ఎటువంటి చర్చలు ఉండవు. ఎందుకంటే, ఇది భద్రతకు సంబంధించిన అంశం” అని అబ్బాస్ అన్నారు.
”ఇరాన్‌పై జరిగే ఏ సైనిక చర్య అయినా.. శత్రువులకు ఊహించని పరిణామంగా మారుతుంది. వారికి తీవ్ర ప్రభావాన్ని కలిగించవచ్చు” అని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అబ్దుల్ రహీం మౌసావి బీబీసీతో అన్నారు.
”ఏ సైనిక దురాక్రమణ అయినా.. వారికి వ్యూహాత్మక ఓటమిగా మారుతుందని, దీనివల్ల ఈ మొత్తం ప్రాంతానికి యుద్ధం వ్యాపిస్తుందని శత్రువుకు బాగా తెలుసు” అని చెప్పారు.
ఫొటో సోర్స్, Reuters
ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలకు నేతృత్వం వహిస్తోన్న స్టీవ్ విట్కాఫ్, తాను ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్‌ను సందర్శించినట్లు తెలిపారు.
ఇరాన్‌పై సైనిక జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించిన తర్వాత విట్కాఫ్‌ను సంప్రదింపుల కోసం పంపించారు.
వాషింగ్టన్, తెహ్రాన్ మధ్యలో మరో దఫా చర్చలు జరగడానికి ముందే ఈ పర్యటన జరగడం గమనార్హం.
”ఇవాళ, యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్, నేను కలిసి యూఎస్ఎస్ అబ్రహం లింకన్, దాని స్ట్రయిక్ గ్రూప్‌లోని నావికులను కలిశాం. వీరు మనల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు బలమైన శక్తి ద్వారా శాంతి అనే ప్రెసిడెంట్ ట్రంప్ సందేశానికి వారు మద్దతు ఇస్తున్నారు” అని సోషల్ మీడియా పోస్టులో విట్కాఫ్ రాశారు.
యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించారు. ఇది ఇరాన్‌కు ఎంతో దూరంలో లేదు.
బీబీసీ పర్షియన్ ప్రకారం.. ఆక్సియోస్ రిపోర్టర్ బరాక్ రావిడ్ మాట్లాడుతూ.. ”లింకన్, దాని అనుబంధ స్ట్రయిక్ గ్రూప్ భవిష్యత్‌లో ఇరాన్‌పై అమెరికా చేసే దాడుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇరాన్‌తో చర్చలు జరిగిన తర్వాత రోజే వీరి ఈ పర్యటన జరిగింది. ఒకవేళ చర్చలు విఫలమైతే, అమెరికా వద్ద మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయనే సందేశాన్ని తెహ్రాన్‌కు ఇచ్చినట్లు అయింది” అని తెలిపారు.
అమెరికా, ఇరాన్ మధ్యలో చర్చలు మళ్లీ ప్రారంభమైనా… ఈ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని, మోహరింపులను పెంచుతోందని తన వార్తా వర్గాలు చెబుతున్నాయని సీఎన్ఎన్ రిపోర్టర్ కైలీ అట్వూడ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
కాగా ఇరాన్ ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Al Jazeera Forum
దోహాలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఏం చెప్పారు?
చర్చల తర్వాత దోహాకు చేరుకున్న అబ్బాస్ అరాగ్చీ.. అల్ జజీరా ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యాన్ని, పాలస్తీనా అంశాన్ని లేవనెత్తారు.
”అంతర్జాతీయ చట్టానికి ఇంకేమైనా అర్థం ఉందా? లేదా? మానవ హక్కులు నిజంగా అందరికీ చెందినవేనా? కావా? అనే పరీక్షకు చెందినదే పాలస్తీనా అంశమని అబ్బాస్ అన్నారు.
”గాజాలో ఇజ్రాయెల్ నేరాల వల్ల కలిగిన ప్రాణ నష్టం, మొత్తం మానవాళి మనస్సాక్షిని గాయపరిచింది” అని చెప్పారు.
ఈ ”సంక్షోభాలు” యూదులు, క్రిస్టియన్లు, అన్ని మత విశ్వాసాలకు చెందిన కోట్లాది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయని చెప్పారు.
”’పిల్లల ప్రాణం బేరసారాల చిప్ కాకూడదు. ఆకలి ఆయుధంగా మారకూడదు. ఆస్పత్రులు యుద్ధ క్షేత్రాలు కాకూడదు. కుటుంబాలను చంపడం ఆత్మ రక్షణకు చట్టబద్ధంగా పరిగణించకూడదు’ అని నమ్మేవారు ఉన్నారు” అని తెలిపారు.
చట్టానికి మించి ప్రవర్తించేలా ఒక పక్షానికి అనుమతించినంత కాలం ఏ ప్రాంతంలో స్థిరత్వం ఉండదని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు.
ఆధిపత్య ధోరణి కారణంగానే ఇజ్రాయెల్ తన ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు అనుమతి పొందుతోందని, ఈ ప్రాంతంలో ఇతర దేశాలను నిరాయుధీకరణ చేయాలని ఒత్తిడి చేస్తోందని అబ్బాస్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



