SOURCE :- BBC NEWS

భారత్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగంపై కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 27 శాతం సుంకాలు విధించింది.
దీనివల్ల ఏపీలోని ఆక్వారంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా ఉండే భీమవరం ప్రాంతంలో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారుల వివరాల ప్రకారం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 27% సుంకం విధించింది.
ఇప్పటికే భారతదేశ రొయ్యలపై అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీతో పాటు, 5.7% కౌంటర్ వయలింగ్ డ్యూటీ (సీవీడీ) వసూలు చేస్తోంది.
ఈ సుంకాలన్నీ కలుపుకుంటే దాదాపు 35 శాతానికి పైగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.


‘లక్షలో సగం పన్నులు, ఖర్చులకే’
తాజా సుంకాలను కలుపుకుంటే లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే ఇప్పుడు రూ.26,000 సుంకం చెల్లించాలి. యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వయోలిన్ డ్యూటీ కూడా కలిపితే రూ.35 వేలకు పైగా కట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీనికి రవాణా, ప్యాకింగ్ ఖర్చులు అదనం. లక్ష రూపాయల్లో సగం ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని కొందరు రైతులు చెప్పారు.

ఆక్వా రంగంపై ట్రంప్ సుంకాల ప్రభావం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు ఆక్వా రైతులతో మాట్లాడింది.
”నేను ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాను. తీరా సోమవారం రొయ్య పట్టిన తర్వాత మార్కెట్‌కి ఫోన్ చేస్తే వంద కౌంట్‌కి 40 రూపాయలు తగ్గిందని చెప్పారు. అదేమంటే అమెరికాలో తగ్గించారని చెప్పారు. ఇప్పుడు ట్రేడర్లు చెప్పే లెక్క వేసుకుంటే నాకు 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు.” అని రెండు ఎకరాల్లో రొయ్యల చెరువు వేసిన రైతు లక్ష్మీపతి ఆందోళన వ్యక్తం చేశారు.
”ఫీడ్ ధరలు పెరిగిపోయి రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది” అని భీమవరం రూరల్‌లో వంద ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్న రైతు చినమిల్లి వెంకటరాయుడు, 16 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న అడపా సాయి వెంకటనాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
‘ధరలు తగ్గినా బేరాల్లేవ్’
అమెరికా సుంకం ప్రభావంతో గత వారం నుంచి రొయ్యల ధరలు తగ్గిపోయాయని రైతులు చెబుతుంటే మార్కెట్‌లో రొయ్యలు అమ్ముకునే చిరు వ్యాపారులు మాత్రం ధర తగ్గినా తమకు పెద్దగా బేరాలు లేవని అంటున్నారు.
”నాలుగు రోజుల కిందట వరకు వంద కౌంట్ రొయ్య రూ.250కి అమ్మాం. ఇప్పుడు రూ.210కి అమ్ముతున్నాం. కానీ బేరాల్లేవ్. రైతులు బాధ రైతులది. మా బాధ మాది” అని భీమవరంలోని గంగానమ్మ ఫిష్ మార్కెట్‌లో వ్యాపారులు నూకరత్నం, శంకర్‌రావు తెలిపారు.

‘రేటు పెంచినా చిక్కే’
అమెరికా ప్రజలు వినియోగించే రొయ్యలలో 90 శాతం దిగుమతులవేనని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇందులో ఎక్కువశాతం ఇండియా, ఈక్వెడార్, ఇండోనేసియా, వియత్నాం నుంచే వస్తాయని తెలిపింది.
తాజా సుంకాలను భరించాలంటే భారత్‌లోని రొయ్యల ఎగుమతిదారులు ధరలు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఈక్వెడార్, వియత్నాం, తైవాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్ నుంచి దిగుమతి చేసుకునే రొయ్యల ధర ఎక్కువగా ఉండి, అమెరికన్లు భారతదేశ రొయ్యలపై ఆసక్తి చూపించకపోవచ్చు. దీంతో రొయ్యల రైతులకు సమస్యలు తప్పకపోవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో విశ్లేషించింది.
ఏపీ నుంచి రొయ్యలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో నిర్ణయించే రేటుపైనే ఇక్కడి ఆక్వా పరిశ్రమ ఆధారపడి ఉందని ఏపీ సీఫుడ్ సప్లయిర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరామమూర్తి బీబీసీతో అన్నారు.
అమెరికా విధించిన అదనపు సుంకాన్ని తగ్గించాలని ట్రేడర్ల తరఫున తాము కూడా సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు.

‘ఏపీనే టాప్’
భారత్‌లో రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉందని, దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తే అందులో 70 శాతానికి పైగా ఏపీ నుంచే ఉంటోందని రొయ్య రైతుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుగ్గిరాల గోపీనాథ్ బీబీసీకి తెలిపారు.
ఏపీలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో సుమారు 29శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని, మిగిలినవి చైనా, జపాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయని ఆయన వెల్లడించారు.
ఏపీలో చేపలు, రొయ్యల చెరువుల విస్తీర్ణం దాదాపు 5,73,535 ఎకరాలు అని, రైతులు సుమారు 2 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. ఏపీలో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి సింహభాగం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.

ఎగుమతిదారులు ఏమంటున్నారంటే..
ఈ సంక్షోభం ఎక్కువకాలం ఉండదని, ఇలాంటి సమయంలో కంగారు పడకుండా రైతులు వేచిచూడాలని జగదీశ్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ ఎండీ తోట జగదీష్ రైతులకు సూచించారు.
ట్రంప్ టారిఫ్ నిర్ణయం వల్ల అందరూ ఆందోళనగానే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపే వరకు రైతులు సరుకును అమ్మకుండా వేచిచూడాలన్నారు.
‘ట్రంప్ నిర్ణయం ఎగుమతిదారులకు కూడా నష్టం కలిగించేదే. భారత్‌లో రొయ్యల ధరలు తగ్గిపోయాయన్న ప్రచారంతో మిగిలిన దేశాల నుంచి కూడా ధర తగ్గించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇది ఆక్వా రంగాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకువెళ్తుంది” అని తోట జగదీష్ చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రొయ్యల రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతల కోరుతున్నారు.
సాగు ఖర్చులు పెరిగి, పెద్దగా లాభాలు రాకున్నా రైతులు పంట వేస్తున్నారని ఇప్పుడు అమెరికా రూపంలో మరో ముప్పు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బి.పూర్ణచంద్రరావు చెప్పారు.
ప్రభుత్వం ఏమంటోంది?
అమెరికా సుంకం విధింపుతో రాష్ట్రంలో రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.
సుంకాల భారం నుంచి రొయ్యకు మినహాయింపు ఇప్పించేలా కేంద్రం అమెరికాను ఒప్పించాలంటూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి చంద్రబాబు లేఖ రాశారు.
సోమవారం సచివాలయంలో ఆక్వా రంగ నిపుణులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులు, ఎగుమతిదారులు, ఫీడ్ మిల్లుల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా రైతులకు 100కౌంట్ రొయ్యలకు కిలోకి రూ.220 చొప్పున ఇవ్వాలని ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు.

‘క్రాప్ హాలిడే తప్పదు’
ప్రభుత్వం చెప్పినా 100 కౌంట్ రొయ్య కిలోకు రూ.220 ధరను వ్యాపారులు రైతులకు చెల్లించడంలేదని ఆక్వా రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. దీనికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లోని ఆక్వా రైతులు జూలై నుంచి మూడు నెలల పాటు సాగు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బీబీసీకి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS