Home జాతీయ national telgu అమెరికా, ఇరాన్: ఇరుపక్షాల ముందున్న 5 ప్రధాన సవాళ్లేంటి?

అమెరికా, ఇరాన్: ఇరుపక్షాల ముందున్న 5 ప్రధాన సవాళ్లేంటి?

6
0

SOURCE :- BBC NEWS

అమెరికా, ఇరాన్, శాంతి చర్చలు, ఇజ్రాయెల్, పాకిస్తాన్, లెబనాన్, మిడిల్ ఈస్ట్

ఫొటో సోర్స్, Getty/Tasnim News Agency

అత్యంత కీలకమైన అమెరికా – ఇరాన్ చర్చలకు ఇస్లామాబాద్ వేదికైంది. ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ అధికారులు చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చర్చలకు ముందు ఆశాజనకంగానే కనిపించారు. అమెరికా నుంచి బయలుదేరే ముందు ఆయన మాట్లాడుతూ, ”ఇరానియన్లు మంచి ఉద్దేశంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటే, మేము కచ్చితంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.

అయితే, అదే సమయంలో ఆయన, “ఒకవేళ వారు మాతో ఆటలాడాలని చూస్తే, ఈ చర్చల బృందం దానికి ఏమాత్రం అంగీకరించబోదని వారు గ్రహించాలి” అని ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు.

ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గాలిబాఫ్ ఇస్లామాబాద్‌‌లో ఇరాన్ జర్నలిస్టులతో మాట్లాడుతూ, “ఏడాదిలోపే, రెండు విడతలు చర్చలు జరిగినా, మాకు మంచి ఉద్దేశాలు ఉన్నా, మాపై దాడులు జరిగాయి. అనేక యుద్ధ నేరాలు కూడా జరిగాయి” అని గాలిబాఫ్ పేర్కొన్నట్లు బీబీసీ ఉర్దూ పేర్కొంది.

“మా ఉద్దేశాలు మంచివే, కానీ మాకు అమెరికాపై నమ్మకం లేదు” అని ఆయన అన్నారు.

అయితే, ఇరుపక్షాల మధ్య ఇస్లామాబాద్‌లో చర్చల అనంతరం జేడీ వాన్స్ మాట్లాడుతూ “బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదర్లేదు” అని చెప్పారు.

అమెరికా మితిమీరిన డిమాండ్లను నియంత్రించుకుని, ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను అంగీకరించాలని ఇరాన్ పేర్కొంది.

ఏది ఏమైనా, ఇరుపక్షాల ముందు భారీ అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పడం సమంజసం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, లెబనాన్, మిడిల్ ఈస్ట్, అంతర్జాతీయం

ఫొటో సోర్స్, Reuters

లెబనాన్

ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌లోని హిజ్బొల్లా అనే సాయుధ గ్రూపుపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలు చర్చలను నీరుగార్చేలా కనిపిస్తున్నాయి.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ దీనిపై ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ, ”ఈ చర్యలు ఇలాగే కొనసాగితే చర్చలకు అర్థం ఉండదు. మా వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి. ఇరాన్ తన లెబనీస్ సోదర, సోదరీమణులను ఎప్పటికీ వదిలేయదు” అని పేర్కొన్నారు.

మరోవైపు, హిజ్బొల్లా విషయంలో ‘యుద్ధ విరమణ’ అనే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెబుతున్నారు. అయితే, బేరూత్ దక్షిణ శివారు ప్రాంతాల నివాసితులు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు తదుపరి చర్యలేవీ తీసుకోలేదు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలు ఇకపై ‘కొంచెం తక్కువ స్థాయిలో’ ఉంటాయని చెప్పారు. అలాగే వచ్చే వారం వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

అయితే, ఇరాన్‌ను సంతృప్తి పరచడానికి ఈ చర్యలు సరిపోతాయా లేదా అనేది వేచిచూడాలి.

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, లెబనాన్, మిడిల్ ఈస్ట్, అంతర్జాతీయం

ఫొటో సోర్స్, Reuters

హార్ముజ్ జలసంధి

చర్చలకు అడ్డంకిగా మారే మరో కీలక అంశం చమురు రవాణాకు అత్యంత ప్రధానమైన హార్ముజ్ జలసంధి.

నౌకలను ఈ జలసంధి మీదుగా అనుమతిస్తామని మొదట చెప్పినప్పటికీ ఇరాన్ ఆ విషయంలో “చాలా దారుణంగా వ్యవహరిస్తోంది” అని ట్రంప్ విమర్శించారు.

“మనం చేసుకున్న ఒప్పందం ఇది కాదు!” అని ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ “అగౌరవంగా” ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో నౌకలు మాత్రమే హార్ముజ్ మార్గం గుండా వెళ్తున్నాయి. వందలాది నౌకలు, సుమారు 20 వేల మంది నావికులు ఇప్పటికీ గల్ఫ్ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు.

ఈ కీలక జలమార్గంపై పట్టు సాధించిన ఇరాన్, దీనిని అధికారికం చేయాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. దీనిని ఇరాన్ తన “సార్వభౌమ జలాలు”గా పేర్కొంటూ, అక్కడ ఏవి వెళ్లవచ్చు, ఏవి వెళ్లకూడదు అనే దానిపై కొత్త నిబంధనలను రూపొందించడం గురించి మాట్లాడుతోంది.

గురువారం నాడు ఇరాన్, ప్రస్తుతం ఉన్న రెండు ట్రాఫిక్ ఛానళ్లకు ఉత్తరాన కొత్త రవాణా మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

షిప్పింగ్ కంపెనీలలో ఉన్న భయాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఒక ప్రకటనలో, ”ప్రధాన ట్రాఫిక్ జోన్‌లో ఉన్న వివిధ రకాల యాంటీ – షిప్ మైన్ల నుంచి తప్పించుకోవడానికి ఈ కొత్త మార్గాలు అవసరం” అని పేర్కొంది.

ఇటీవలి వారాల్లో ఈ మార్గం దాటిన కొన్ని నౌకలు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.18.61 కోట్లు) టోల్ రుసుము చెల్లించాయన్న నివేదికల నేపథ్యంలో, ”ట్యాంకర్ల నుంచి ఇరాన్ ఫీజులు వసూలు చేయకపోవడమే మంచిది” అని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, లెబనాన్, మిడిల్ ఈస్ట్, అంతర్జాతీయం

ఫొటో సోర్స్, Getty Images

అణు కార్యక్రమం

బహుశా అన్నింటికంటే పెద్దది, దశాబ్దాలుగా నలుగుతున్న వివాదాస్పద అంశం ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ “ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు” అనే ఉద్దేశంతోనే తాను ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభించినట్లు ట్రంప్ చెప్పారు.

ఇరాన్ మాత్రం తాము ఎప్పుడూ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నించలేదని చెబుతోంది. అయితే, మెజారిటీ పాశ్చాత్య దేశాలు ఈ వాదనను తీవ్ర సందేహంతోనే చూస్తాయి. కానీ, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేసిన దేశంగా, పౌర అవసరాల కోసం యురేనియంను పెంపొందించుకొనే హక్కు తమకు ఉందని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

“చర్చలకు ఒక ఆచరణీయమైన ప్రాతిపదిక”గా ట్రంప్ అభివర్ణించిన.. ఇరాన్ 10-సూత్రాల ప్రతిపాదనలో, తన యురేనియం శుద్ధి హక్కులకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించాలనే డిమాండ్ కూడా ఉంది.

కాగా, ట్రంప్ స్వయంగా రూపొందించిన 15-అంశాల ప్రణాళిక మాత్రం “ఇరాన్ గడ్డపై అన్ని రకాల యురేనియం శుద్ధి కార్యక్రమాలను నిలిపివేయాలి” అని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

దీనిపై ఈ వారంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ స్పందిస్తూ, ఇరాన్ “ఎప్పటికీ అణ్వాయుధాన్ని గానీ, దాన్ని పొందే సామర్థ్యాన్ని గానీ కలిగివుండదు” అని మాత్రమే వ్యాఖ్యానించారు.

ఈ సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి గతంలో అంతర్జాతీయ చర్చల బృందానికి 2015 నాటి ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ) ఒప్పందానికి రావడానికి ఏళ్ల సమయం పట్టింది.

మరి ఇప్పుడు ఇరుపక్షాలు కొత్త ఒప్పందం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాయా?

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, లెబనాన్, మిడిల్ ఈస్ట్, అంతర్జాతీయం

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ప్రాంతీయ మిత్రులు

లెబనాన్‌లోని హిజ్బొల్లా, యెమెన్‌లోని హూతీలు, గాజాలోని హమాస్, ఇరాక్‌లోని రకరకాల సాయుధ ముఠాలు (మిలీషియాలు) ఇలా ఇరాన్ మిత్రపక్షాలు, ప్రాక్సీ గ్రూపుల నెట్‌వర్క్ తెహ్రాన్‌కు ప్రాంతీయంగా గొప్ప మద్దతు ఇచ్చింది.

ఇజ్రాయెల్, అమెరికాతో దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలలో ఇరాన్ తన “ఫార్వర్డ్ డిఫెన్స్” వ్యూహాన్ని అమలు చేయడానికి ఇవి దోహదపడుతున్నాయి.

2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఇరాన్ “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” అని పిలుచుకునే ఈ నెట్‌వర్క్ నిరంతర దాడులకు గురవుతోంది. ఇందులో ఒక భాగంగా ఉన్న సిరియా మాజీ నియంత బషర్ అల్-అసద్ పాలన ఇప్పుడు ఉనికిలోనే లేదు.

అయితే, ఇజ్రాయెల్ మాత్రం దీనిని “యాక్సిస్ ఆఫ్ ఈవిల్”గా పరిగణిస్తోంది. ఇది తమ మనుగడకే ముప్పు అని, దీనిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న ఈ సమయంలో, తమ ప్రభుత్వం విదేశీ యుద్ధాలపై తక్కువ ఖర్చు చేసి, ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని చాలామంది ఇరానియన్లు కోరుకుంటున్నారు.

కానీ, ఇరాన్ తన మిత్రదేశాలను, మిత్రపక్షాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి సూచనలు కనిపించడం లేదు.

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, లెబనాన్, మిడిల్ ఈస్ట్, అంతర్జాతీయం

ఫొటో సోర్స్, Getty Images

ఆంక్షలు తొలగించాలనే డిమాండ్

ఇరాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తీవ్రమైన అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతోంది. ఏదైనా ఒప్పందం కుదరాలంటే అమెరికా విధించిన, అంతర్జాతీయ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

శుక్రవారం నాడు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగర్ గాలీబాఫ్ మాట్లాడుతూ, చర్చలు ప్రారంభం కావడానికి ముందే స్తంభింపజేసిన సుమారు 120 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.17 లక్షల కోట్లు) ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని అన్నారు.

గతంలో అంగీకరించిన రెండు చర్యలలో (రెండవది లెబనాన్‌లో కాల్పుల విరమణ) ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు.

అయితే, రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటిస్తూ ఏప్రిల్ 7న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనలో, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. గాలీబాఫ్ ఏ ఒప్పందాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియడం లేదు.

కేవలం చర్చల కోెసం ట్రంప్ ప్రభుత్వం ఇంతటి భారీ రాయితీ ఇవ్వడానికి సిద్ధమయ్యే అవకాశం చాలా తక్కువ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)