Home జాతీయ national telgu అమరావతి: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం ఎంత వరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుంది?

అమరావతి: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం ఎంత వరకు వచ్చింది, ఎప్పటికి పూర్తవుతుంది?

4
0

SOURCE :- BBC NEWS

సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిగా ప్రభుత్వం చెబుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంపై మళ్లీ కదలిక వచ్చింది.

జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు, విజయవాడ నగరం నుంచి రాజధానికి ఇప్పటికీ సరైన అనుసంధాన రోడ్డు లేదనే విమర్శల నేపథ్యంలో ఆ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించినట్టు కూటమి ప్రభుత్వం వెల్లడించింది.

రాజధాని ప్రాజెక్టుల్లో రోడ్డు కనెక్టివిటీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ మేరకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ)ను ఆదేశించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
నారా చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, UGC

ఏమిటీ సీడ్‌ యాక్సెస్ రోడ్‌?

అమరావతి రాజధాని పరిధిలోని దొండపాడు నుంచి చెన్నై– విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని కనకదుర్గమ్మ వారధి వరకు 200 అడుగుల వెడల్పుతో విశాలమైన ఎనిమిది వరుసల రోడ్డు (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) నిర్మించాలని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.

రాజధానిలోని అన్ని ముఖ్య రహదారులు ఈ రోడ్డుతో అనుసంధానమవుతాయి.

ఆ మేరకు కృష్ణా కరకట్టకు సమాంతరంగా దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18.270 కిలోమీటర్ల రహదారిని ఒక ప్యాకేజీగా విభజించారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గమ్మ వారధి సమీపంలో మణిపాల్‌ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో అనుసంధానించేందుకు 3.06 కిలోమీటర్ల రహదారిని రెండో ప్యాకేజీగా విభజించారు.

మొదటి ప్యాకేజీ పనులకు 2016 మే 25న వెంకటపాలెం వద్ద అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

2018 చివరి నాటికి 18.270 కిలోమీటర్ల తొలి ప్యాకేజీలో భాగంగా వెంకటపాలెంలోని మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు సుమారు 14 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేశారు.

బోర్డ్

భూసమీకరణ సమస్యతో నిలిచిన నిర్మాణం

వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం భూసమీకరణ సమస్యలతో నిలిచిపోయింది.

ఈ నాలుగు కిలోమీటర్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం ఉండవల్లి, పెనుమాక గ్రామాల మీదుగా వెళ్తుంది.

అయితే ఆ గ్రామాల పరిధిలోని రైతులు భూములిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రోడ్డు నిర్మాణానికి అప్పట్లో బ్రేక్‌ పడింది.

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ.. ఈ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకి సమాంతరంగా ఉన్న కరకట్ట రహదారి విస్తరణపై దృష్టి పెడతామని ప్రకటించింది. కానీ దీనిపై అక్కడి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది కూడా కార్యరూపం దాల్చలేదు.

రహదారి

మళ్లీ భూ సమీకరణ మొదలు

గతేడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది.

ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి భూసమీకరణకు ఒప్పించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో సీడ్‌యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసమీకరణకు రైతులతో సీఆర్‌డీఏ జరిపిన సంప్రదింపులు ఫలించాయి.

భూములిచ్చేందుకు సమ్మతించిన రైతులు తమకు సీడ్‌యాక్సెస్‌ రోడ్డుకు సమీపంలోని గ్రామాలకు చెందిన ఎల్‌పీఎస్‌(ల్యాండ్‌ పూలింగ్‌ సిస్టమ్‌) లేఅవుట్లలో స్థలాలు ఇవ్వాలని కోరారు.

ఆ మేరకు వారికి వెలగపూడి, వెంకటపాలెం,మందడం గ్రామాల పరిధిలోని ఎల్‌పీఎస్‌ లేఅవుట్లలో స్థలాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ అధికారులు అంగీకరించారు.

రోడ్

పెనుమాకలో 2, ఉండవల్లిలో 30ఎకరాలు పెండింగ్‌

”ఇప్పుడు ప్యాకేజీ–1 పూర్తి చేయడంలో భాగంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంలో మిగిలి ఉన్న నాలుగు కిలోమీటర్ల రోడ్డు కోసం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో భూ సమీకరణపై స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నాం, భూ సమీకరణ కింద ఎకరం భూమి ఇచ్చిన వారికి వెలగపూడి, వెంకటపాలెం,మందడం గ్రామాల్లో 1450 గజాల డెవలప్డ్‌ ప్లాట్‌ ఇస్తాం.. అందులో వెయ్యి గజాలు రెసిడెన్షియల్, 450 గజాలు కమర్షియల్‌ ప్లాట్‌ కింద ఇస్తాం.. ఇప్పటికే గత నాలుగు రోజులుగా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. పెనుమాక గ్రామ పరిధిలో 21ఎకరాల భూములు కావాల్సి ఉండగా, ఇక కేవలం 2.3ఎకరాలు మాత్రమే రావాల్సి ఉంది.” అని సీఆర్‌డీఏ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చిన్నికృష్ణ బీబీసీకి తెలిపారు.

‘ఇక ఉండవల్లి గ్రామానికి వచ్చేసరికి 50ఎకరాలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 20ఎకరాలను మాత్రమే రైతులు ఇచ్చారు. ఇంకా 30ఎకరాలకు సీఆర్‌డీఏ భూసమీకరణ చేయాల్సి ఉంది. ఉంది. రైతులు సహకరిస్తారని ఆశిస్తున్నాం, లేనిపక్షంలో భూసేకరణే చేపట్టాల్సి ఉంటుంది’ అని సీఆర్‌డీఏకి చెందిన ఓ ఉన్నతాధికారి బీబీసీకి తెలిపారు.

రోడ్

త్వరలో ప్యాకేజీ–2 డీపీఆర్‌ సిద్ధం

ప్యాకేజీ–1 పూర్తి చేయడంలో భాగంగా భూసమీకరణకు మరో 3 నెలలు సమయం పట్టే అవకాశముందని, వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగానికి చెందిన ఉన్నతాధికారి బీబీసీతో చెప్పారు.

ముందుగా ప్యాకేజీ–1 పూర్తి చేసేందుకు దృష్టి సారించామని, దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ట్రంకు రోడ్డు (పాత జాతీయ రహదారి)కి అనుసంధానం చేస్తామని వెల్లడించారు.

ఆ తర్వాత ప్యాకేజీ–2 పనులు మొదలు పెడతామని తెలిపారు.

ఈ మేరకు ప్యాకేజీ–2లో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 3.08 కి.మీ. పొడవున రహదారి నిర్మించేందుకు డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

రెండో దశలో పాత జాతీయరహదారి, రైల్వే లైన్లపై నుంచి వెళ్లేలా నుంచి పీడబ్ల్యుడీ వర్క్‌షాపు నుంచి సుందరయ్యనగర్‌ వరకూ ఫ్లైఓవర్‌ నిర్మించాలని, ఫ్లై ఓవర్‌ దిగిన తర్వాత హైవేకు కనెక్ట్ చేస్తూ మణిపాల్‌ హాస్పిటల్‌ వరకూ రోడ్డు నిర్మించాలని సీఆర్‌డీఏ డైరెక్టర్‌ స్థాయి అధికారి బీబీసీకి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)