Home జాతీయ national telgu అన్నంలో ఆర్సెనిక్.. వరి ఎలా పండిస్తే ఈ ప్రమాదకర రసాయనం మోతాదు తగ్గుతుంది? ఏఏ దేశాల్లో...

అన్నంలో ఆర్సెనిక్.. వరి ఎలా పండిస్తే ఈ ప్రమాదకర రసాయనం మోతాదు తగ్గుతుంది? ఏఏ దేశాల్లో పండే పంటలో ఇది తక్కువగా ఉంటుంది

4
0

SOURCE :- BBC NEWS

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, అమండా రుగ్గేరి
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 19 ఏప్రిల్ 2025, 15:36 IST

    అప్‌డేట్ అయ్యింది 3 గంటలు క్రితం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి బియ్యం ప్రధాన ఆహారం. గోధుమ లేదా మొక్కజొన్న కంటే ప్రతిరోజూ ఎక్కువ మంది బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. కానీ, వాతావరణ మార్పులు ఈ ఆహారాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భూమి వేడెక్కడం, కర్బన ఉద్గారాలు పెరిగేకొద్దీ బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరగవచ్చని సూచిస్తున్నారు.

ఆర్సెనిక్ అనేది దాదాపు అన్ని రకాల బియ్యంలో కనిపించే హానికరమైన రసాయనం. పొలంలోని నేల నుంచి ఇది వరిలోకి వస్తుంది.

కొన్ని రకాల బియ్యంలో చాలా తక్కువ మొత్తంలో ఆర్సెనిక్ ఉంటుంది, మరికొన్నిటిలో ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్య నిపుణులు సురక్షితమైనదని చెప్పే దానికంటే ఎక్కువ మోతాదులో ఆర్సెనిక్ బియ్యంలో కనిపిస్తుంది.

ఆర్సెనిక్ తక్కువ మొత్తంలో ఎక్కువ కాలం తిన్నా హానికరం కావచ్చు. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహానికి కారణమవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో పరిశోధన

బియ్యంలో ఆర్సెనిక్ మొత్తాన్ని తగ్గించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. తినడానికి ముందు బియ్యం నుంచి కొంత ఆర్సెనిక్‌ను తొలగించడంలో సహాయపడే వంట పద్ధతులు కూడా ఉన్నాయి.

కానీ, వాతావరణ మార్పుల కారణంగా సమస్య మరింత తీవ్రమవుతుందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. చైనాలోని నాలుగు విభిన్న ప్రదేశాలలో పరిశోధకులు 28 రకాల వరి పంటలను పండించారు. ప్రత్యేక పరీక్ష పరిస్థితులను ఉపయోగించి వారు 10 సంవత్సరాలుగా ఈ అధ్యయనం చేశారు.

వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (CO₂) స్థాయి, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బియ్యంలో ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆరోగ్య నిపుణులు పరిశీలించారు. ప్రజలు అదే మొత్తంలో బియ్యం తినడం కొనసాగిస్తే, ఈ అధిక ఆర్సెనిక్ స్థాయి చైనాలో అదనంగా దాదాపు 1.93 కోట్ల క్యాన్సర్ కేసులకు దారితీయవచ్చని వారు కనుగొన్నారు.

“క్యాన్సర్‌కు అకర్బన ఆర్సెనిక్(ఇనార్గానిక్ ఆర్సెనిక్) కారణమవుతుందని, ఊపిరితిత్తులు, గుండెకు హాని కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది” అని ఈ అధ్యయన సహ రచయిత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ జిస్కా అన్నారు.

“వాతావరణ మార్పులలో రెండు ప్రధాన భాగాలైన అధిక CO₂, అధిక ఉష్ణోగ్రతలు ఆర్సెనిక్ స్థాయిలను పెంచుతున్నాయి” అని జిస్కా తెలిపారు.

ఈ అధ్యయనం చైనాలో జరిగింది, కానీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పండించే బియ్యంలో కూడా అకర్బన ఆర్సెనిక్ ఉంటుంది కాబట్టి, యూరప్, అమెరికా వంటి ఇతర ప్రదేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

“CO₂ లేదా ఉష్ణోగ్రతను విడిగా అధ్యయనం చేసిన మొదటి వ్యక్తులం మేం కాదు. కానీ ఈ రంగంలో రెండింటినీ కలిపి పరీక్షించిన మొదటి వ్యక్తులం మేమేం. ఈ ఫలితాలు మమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచాయి” అని జిస్కా చెప్పారు.

బియ్యం, వరి పంట

ఫొటో సోర్స్, Getty Images

ఒకవేళ బ్రౌన్ రైస్ తింటే?

అయితే, ఈ అధ్యయనానికీ పరిమితులు ఉన్నాయి. ఉదాహరణకు, ప్రజలు 2021లో తిన్నంత బియ్యాన్ని 2050లో కూడా తింటారని పరిశోధకులు భావించారు. కానీ చాలా దేశాలలో ప్రజలు ధనవంతులవుతున్న కొద్దీ బియ్యం తక్కువ తింటున్నారు.

ఇక రెండోది, ప్రజలు ఇప్పటిలాగే భవిష్యత్తులో కూడా బ్రౌన్ రైస్ కంటే ఎక్కువగా తెల్ల బియ్యాన్ని తింటారని పరిశోధకులు భావించారు.

తెల్లని బియ్యం ప్రాసెస్ చేసిన విధానం వల్ల దానిలో తక్కువ అకర్బన ఆర్సెనిక్ ఉంటుంది. ఒకవేళ పరిశోధకుల అంచనా తప్పి, ఎక్కువమంది బ్రౌన్ రైస్ తినడం ప్రారంభిస్తే కేసులు ఇంకా పెరగవచ్చు.

అయినప్పటికీ, ”ఈ విషయంపై ఇప్పటివరకు చేసిన అత్యుత్తమమైన, పూర్తి అధ్యయనాలలో ఇది ఒకటి” అని క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్‌లోని స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ ఆండ్రూ మెహార్గ్ అన్నారు.

ఒక వ్యక్తి తక్కువ మొత్తంలో చాలా సంవత్సరాల పాటు ఆర్సెనిక్ తీసుకున్నా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఇటీవలి దశాబ్దాలలో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

అకర్బన ఆర్సెనిక్ సహజంగా రాళ్లు, నేలలో కనిపిస్తుంది. కానీ ఇది మైనింగ్, బొగ్గును కాల్చడం, ఇతర పారిశ్రామిక పనుల వంటి మానవ కార్యకలాపాల నుంచి కూడా రావొచ్చు.

బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఏ బియ్యం తక్కువ ప్రమాదకరం..

దక్షిణ అమెరికా, దక్షిణ, మధ్య ఆసియాలతో సహా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోని భూగర్భ జలాల్లో అకర్బన ఆర్సెనిక్ తరచుగా కనిపిస్తుంది.

ఇతర ప్రదేశాలలో ప్రజలు కూడా ఈ ప్రమాదంలో ఉన్నారు. ఉదాహరణకు, అమెరికాలో 7 శాతానికి పైగా జనం ప్రైవేటు బావులను వాడుతారు. అంటే దాదాపు 21 లక్షల మంది సురక్షితం కాని స్థాయిలలో అకర్బన ఆర్సెనిక్ ఉన్న నీటిని తాగుతున్నారు.

డబ్ల్యూహెచ్‌వో సురక్షితమైనదని చెప్పిన దానికంటే ఎక్కువ ఆర్సెనిక్ ఉన్న నీటిని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మంది తాగుతున్నారు.

తాగునీటితో పాటు ఆహారం ద్వారా ప్రజలు ఆర్సెనిక్‌కు గురయ్యే అతిపెద్ద మార్గం బియ్యం తినడం. భూగర్భ జలాలలో తక్కువ ఆర్సెనిక్ స్థాయిలుండే యూరప్ వంటి ప్రదేశాలలోనూ బియ్యం రూపంలో వారి శరీరంలోకి అత్యధికంగా అకర్బన ఆర్సెనిక్‌ చేరుతోంది.

వరద ముంచెత్తితే..

ప్రపంచంలోని 75 శాతం వరిని వరదలున్న పొలాల్లో ఎలా పండిస్తారనేది ప్రధాన సమస్య అని జిస్కా అంటున్నారు.

వరి పంట నీటిలో పెరుగుతుంది.

“పొలాలను వరద ముంచెత్తితే నేల నుంచి ఆక్సిజన్ తొలగిపోతుంది” అని తెలిపారు జిస్కా.

దీంతో నేలలోని కొన్ని బ్యాక్టీరియాలు జీవించడానికి ఆక్సిజన్‌కు బదులుగా ఆర్సెనిక్‌ను వినియోగించుకుంటాయి. ఈ బ్యాక్టీరియా రసాయన మార్పులను కలిగిస్తుంది, వరి మొక్కలను వాటి వేర్లు ద్వారా ఆర్సెనిక్‌ను సులభంగా తీసుకునేలా చేస్తుంది.

“నేలలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు, ఆర్సెనిక్ మరింత చురుగ్గా మారుతుంది” అని జిస్కా చెప్పారు.

ఈ మార్పు నేలలోని సూక్ష్మజీవులని కూడా ప్రభావితం చేస్తుంది, ఆర్సెనిక్‌ను ఇష్టపడే బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది.

ఉష్ణోగ్రతలు, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతూనే ఉండటంతో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని జిస్కాతో పాటు ఆయన బృందం విశ్వసిస్తోంది.

“ఈ బ్యాక్టీరియా మరింత కార్బన్, ఎక్కువ వేడిని పొందుతోంది. ఇది బ్యాక్టీరియాను మరింత చురుగ్గా చేస్తుంది” అని జిస్కా చెప్పారు.

ఈ 10 సంవత్సరాల అధ్యయనంలో పరీక్షించిన 28 వరి రకాలలో దాదాపు 90 శాతం ఇలా జరగడం చూసినట్లు జిస్కా బృందం తెలిపింది.

 క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

క్యాన్సర్ ముప్పు

ఆర్సెనిక్ విషయంలో ప్రజారోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే శాస్త్రవేత్తలు అకర్బన ఆర్సెనిక్ గురించి ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే, అది మానవ ఆరోగ్యానికి అంత ప్రమాదకరమని తెలుస్తోంది.

క్యాన్సర్‌కు ఆర్సెనిక్ కారణమయ్యే అవకాశం ఎంత ఉందనే విషయంపై దాని సమీక్షను అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) 2025 జనవరిలో నవీకరించింది. తాజా పరిశోధనలను పరిశీలించారు. గతంలో అనుకున్న దానికంటే ఆర్సెనిక్ మరింత హానికరమని కనుగొన్నారు.

“ఆర్సెనిక్ మనం అనుకున్న దానికంటే చాలా బలమైన క్యాన్సర్ కారకం” అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్స్ ప్రొఫెసర్, రైస్ అండ్ ఆర్సెనిక్ స్టడీ సహ రచయిత కీవ్ నాచ్‌మన్ అన్నారు.

ఆర్సెనిక్ చర్మం, ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని బలమైన ఆధారాలు ఉన్నాయి.

అకర్బన ఆర్సెనిక్ క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భిణులు ఎక్కువ ఆర్సెనిక్ తింటే బిడ్డ పుట్టకముందే లేదా వెంటనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కారణమవుతుంది. గుండె జబ్బులు, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఇక వ్యక్తిగతంగా పరిశీలిస్తే.. 60 కిలోల బరువున్న వ్యక్తి రోజుకు 7.8 మైక్రోగ్రాముల అకర్బన ఆర్సెనిక్ తింటే వారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 3 శాతం పెరుగుతుందని, మధుమేహం వచ్చే ప్రమాదం దాదాపు ఒక శాతం పెరుగుతుందని ఈపీఏ చెబుతోంది. జిస్కా, అతని బృందం అంచనాలు సరైనవని తేలితే, భవిష్యత్తులో బియ్యం తినే జనాభాకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలొస్తాయి.

కాబట్టి, ఉద్గారాలను తగ్గించడం, ఉష్ణోగ్రత పెరుగుదలను వీలైనంత తక్కువగా ఉంచడం పక్కన పెడితే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయవచ్చు?

వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

పరిష్కారం ఏమిటి?

“మనం బియ్యం తినడం ఆపలేం” అని నాచ్‌మన్ చెప్పారు.

బియ్యం అనేక ఆహార సంప్రదాయాలలో భాగం మాత్రమే కాదు, పేదరికంలో నివసించే ప్రజలకు చాలా ముఖ్యమైనది. వారు బియ్యం నుంచి వారి రోజువారీ కేలరీలలో సగం వరకు పొందుతారు.

“కానీ మనం ఏదైనా కొత్తగా చేయాలి” అని నాచ్‌మన్ అన్నారు.

వరి పొలాలలో ఆర్సెనిక్ స్థాయిలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త మార్గాలను పరీక్షిస్తున్నారు.

ఒక పద్ధతి ఏమిటంటే.. పొలాన్ని పాక్షికంగా నీటితో ఉండేలా చూడాలి. నీరు తగ్గాక మళ్లీ నింపాలి. దానిని నిండుగా ఎప్పుడూ ఉంచవద్దు. ఇది అకర్బన ఆర్సెనిక్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

కానీ, ఒక సమస్య ఉంది. ఆ పద్ధతి కాడ్మియంను పెంచుతుందని మార్హామ్ అంటున్నారు. కాడ్మియం ఇంకా పెద్ద ప్రమాదంగా పరిగణిస్తారు. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్, మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్‌లకు కారణమవుతుంది. కాలేయం, మూత్రపిండాల వ్యాధికి కూడా దారితీస్తుంది.

ఎక్కువ అకర్బన ఆర్సెనిక్‌ను గ్రహించని కొత్త రకాల బియ్యాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ, సత్ఫలితాన్ని ఇవ్వలేదు.

కొన్ని రకాల బియ్యం సహజంగా తక్కువ ఆర్సెనిక్‌ను తీసుకుంటాయి, కాబట్టి పరిశోధకులు వాటిని ఎక్కువగా పెంచడంపై దృష్టి ఉంది. మరొక ఆలోచన ఏమిటంటే నీటిలో సల్ఫర్‌ను కలపడం, ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్‌లను గ్రహించడం ద్వారా ఆర్సెనిక్‌తో పోటీ పడగలదు.

ప్రత్యేక ఎరువులను ఉపయోగించడం ద్వారా నేల బ్యాక్టీరియాను మార్చడం కూడా సహాయపడవచ్చు.

దీనికి ఆశాజనకంగా ఉన్న ఒక మిశ్రమం పర్వత మూలికలు(మౌంటేన్ థైమ్), పక్షి ఎరువు. కానీ ఈ ఆలోచనలన్నీ నిజంగా బాగా పనిచేస్తాయో లేదో తెలియడానికి మరింత పరిశోధన అవసరం.

వరిలో ఆర్సెనిక్‌ను తగ్గించడానికి మరొక మార్గం ఏమిటంటే, వర్షపు నీటి ఆధారిత పరిస్థితులలో లేదా నేల, నీటిలో తక్కువ ఆర్సెనిక్ ఉన్న ప్రదేశాలలో వరి పండించడం.

ఉదాహరణకు, తూర్పు ఆఫ్రికా, ఇండోనేసియా నుంచి వచ్చే బియ్యం ఎక్కువగా వర్షాధారంగా పండుతాయి. ఇందులో చాలా తక్కువ స్థాయిలో అకర్బన ఆర్సెనిక్ ఉన్నట్లు తేలింది.

అమెరికా, మధ్య, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, యూరప్, ఆస్ట్రేలియాలో పండించే బియ్యంలో అధిక స్థాయిలో ఆర్సెనిక్ ఉన్నట్లు కనుగొన్నారు.

ఆహారంలో ఆర్సెనిక్ పరిమితిపై మెరుగైన పర్యవేక్షణ, నియమాలు అవసరమని పరిశోధకులు అంటున్నారు.

“బియ్యంలో ఆర్సెనిక్ తగ్గించడానికి మార్గాలున్నాయి. మనం వరి పండించే విధానాన్ని మార్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రతిరోజూ బియ్యంపై ఆధారపడటంతో ఇది చాలా ముఖ్యం” అని జిస్కా సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)